అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగిన చర్చలు విఫలం అయ్యాయి. 21 గంటలపాటు విస్తృతంగా జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల ప్రతినిధులు పరిష్కారం కోసం ప్రయత్నించినా అవి కొలిక్కి రాలేదు. అర్ధాంతరంగా ముగిశాయి. శాంతి చర్చలు సఫలమౌతాయని, యుద్ధ విరమణపై సంధి కుదురుతుందనే ఆశలకు గండి పడింది. తాజా పరిణామాలు భారీ ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ సంప్రదింపులు ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. చర్చలు విఫలమైన విషయాన్ని ఆయన ధృవీకరించారు. తాము సూచించిన కొన్ని షరతులను ఇరాన్ తిరస్కరించిందని, వీటిపై ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు. చర్చల విఫలం అనేది.. అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టదాయకమని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు ఎటువంటి సంతృప్తికరమైన ఒప్పందానికీ రాలేకపోయాయని తెలిపారు.

తాము ప్రతిపాదించిన అంశాలేవీ కూడా ఇరాన్ కు ఆమోదయోగ్యంగా లేవని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. ఏ ఒప్పందం కూడా కుదరలేదని పేర్కొన్నారు. తాము పెట్టిన షరతులను అంగీకరించకూడదని ఇరాన్ ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. తమ రెడ్ లైన్స్‌ను స్పష్టంగా కమ్యూనికేట్ చేశామని, ఏ విషయాల్లో రాజీ పడాలో.. ఏ విషయాల్లో రాజీ పడకూడదో వివరించామని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా సాధ్యమైనంత స్పష్టమైన వైఖరితో వ్యవహరించామని ఆయన అన్నారు.
ఈ పరిణామాలను బ్యాడ్ న్యూస్ గా అభివర్ణించారు వాన్స్. దీనివల్ల అమెరికా కంటే ఇరాన్‌కే నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనను తొలగించడానికి చివరి వరకు ప్రయత్నించామని, అంతిమంగా ఓ ఉత్తమ ప్రతిపాదనను ఇరాన్ కు అందజేశామని జేడీ వాన్స్ అన్నారు. దీన్ని కూడా ఇరాన్ అంగీకరించలేదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు సఫలం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని, ఇప్పడులాంటివేవీ లేకుండా తిరిగి వెళ్తున్నామని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇరాన్ ఎప్పుడూ అణు ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నించదనే హామీ కోసం అమెరికా ముందు నుంచీ పట్టుబడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో చాలా లిబరల్ గా వ్యవహరించామని, కొన్ని మధ్యే మార్గాలను కూడా సూచించామని జేడీ వాన్స్ అన్నారు. అణు భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications