Afghanistan: బ్రిటన్ ప్రధానికి జో బైడెన్ ఫోన్‌కాల్: త్వరలో జీ7: వేగంగా మారుతోన్న పరిణామాలు
న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలిబన్లు పేట్రేగిపోయారనే అపవాదును మూటగట్టుకుంటోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఆఫ్ఘన్‌లో నెలకొంటోన్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోన్న అగ్రరాజ్యం.. తాలిబన్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి మరోసారి మిత్ర దేశాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నాల్లో పడినట్టే.
Recommended Video

కొత్త ప్రభుత్వానికి ఆంక్షలతో
ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తాము కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్నంత కాలం ఆఫ్ఘనిస్తాన్‌ను శతృదేశంగానే పరిగణించాల్సి ఉంటుందని, అంతర్జాతీయ సమాజం నుంచి బాయ్‌కాట్ చేయాల డిమాండ్‌ను వినిపించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘన్ పౌరుల మానవ హక్కులకు భంగం కలిగించకుండా ఈ చర్యలు ఉండాలని యూఎస్ యోచిస్తోంది.

బ్రిటన్ ప్రధానికి జో బైడెన్ ఫోన్ కాల్
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన మిత్రదేశం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఫోన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆప్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. ఈ అంశంపై రెండు దేశాధినేతల మధ్య టెలిఫోనిక్ సంభాషణ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాలిబన్ల వ్యవహారంలో ప్రజాస్వామిక దేశాలతో కూటమిగా ఏర్పడటం, సమష్ఠి నిర్ణయాలను తీసుకోవడం వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

వచ్చేవారం జీ7 వర్చువల్ మీట్
ఈ నేపథ్యంలో జీ7 సమ్మిట్‌ను నిర్వహించాలని జో బైడెన్ ప్రస్తావించగా.. దానికి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. వచ్చేవారం జీ7 దేశాధినేతలు వర్చువల్‌గా భేటీ కావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆప్ఘనిస్తాన్‌పై జీ7 దేశాలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంటుందని జో బైడెన్-బోరిస్ జాన్సన్ నిర్ణయించినట్లు తెలిపింది. కలిసి వచ్చే దేశాలను కలుపుకోవాల్సి ఉంటుందని వారిద్దరు అభిప్రాయపడినట్లు స్పష్టం చేసింది. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్‌లతో పాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఉన్నాయి.

ఆఫ్ఘన్ రెఫ్యూజీలపై మానవతా దృక్పథం
తాలిబన్ల పరిపాలనను భయపడి దేశం విడిచి వెళ్తోన్న ఆప్ఘనిస్తానీయులు, తాలిబన్ల పరిపాలనలో జీవించే వారిపై ప్రపంచ దేశాలన్నీ మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు సూచించినట్లు వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొంది. తాలిబన్ల ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయంపై ఒక స్పష్టతను సాధించడానికి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై చర్చించడానికి వచ్చే వారం జీ7 దేశాధినేతలు వర్చువల్‌గా సమావేశం కావాలని నిర్ణయించినట్లు పేర్కొంది వైట్‌హౌస్.

24వ తేదీన
మరోవంక- ఆఫ్ఘనిస్తాన్ అంశంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ సైతం భేటీ కానుంది. ఈ నెల 24వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ ఈ భేటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరవుతామంటూ ఇప్పటిదాకా 89 దేశాలు అంగీకారం తెలిపాయి. భారత్ సహా, అర్జెంటీనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండొనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇందులో ఉన్నాయి. అల్జీరయిా, బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, కజకిస్తాన్, మలేసియా, నైజీరియా, ఖతర్, సౌదీ అరేబియా, స్పెయిన్, సిరియా, తజకిస్తాన్, టర్కీ, తుర్క్‌మెనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ తీర్మానానికి ఆమోదం తెలిపాయి.












Click it and Unblock the Notifications