ఒకేరోజు భారత్ కు రెండు షాకులిచ్చిన ట్రంప్..! పాక్ మ్యాప్ లో పీవోకే..!
అమెరికా ఇవాళ భారత్ కు భారీ షాకే ఇచ్చింది. అమెరికా రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరులో నుంచి ఇండో పేరును తీసేసింది. తిరిగి దాని పాత రూపమైన 'యూఎస్ పసిఫిక్ కమాండ్’ (USPACOM)గా మారుస్తూ అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఈ సైనిక కమాండ్ కొనసాగించిన చారిత్రక వారసత్వాన్ని, సాంప్రదాయిక గుర్తింపును గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. అయితే, ఈ పేరు మార్పు ప్రకటనతో పాటే మరో షాక్ కూడా ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్తాన్ భూభాగంలో కలిపేసింది.
నిజానికి 2018లో అప్పటి అమెరికా రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ ఆధ్వర్యంలో ఉన్న యూఎస్ పసిఫిక్ కమాండ్’ విభాగానికి 'ఇండో-పసిఫిక్’ అని పేరు మార్చారు. హిందూ మహాసముద్ర భద్రత, పసిఫిక్ ప్రాంత సమీకరణాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయనే సంకేతాన్ని పంపడం ఆనాటి ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయంతో భారత్-అమెరికా రక్షణ బంధం కూడా మరింత పటిష్టమైంది. అయితే ఇప్పుడు పాత పేరే పెట్టినా కూడా తమ వ్యూహాత్మక లక్ష్యాలలో, అలాగే ప్రాంతీయ మిత్రులతో ఉన్న రక్షణ సంబంధాలలో ఎటువంటి మార్పులు ఉండబోవని అమెరికా రక్షణ విభాగం స్పష్టం చేసింది.

1947 జనవరి 1న ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ హయాంలో ఏర్పాటైన ఈ కమాండ్, అమెరికా సైనిక చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉన్న ఈ సముద్ర రక్షణ వ్యవస్థ పరిధి అలాగే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం చారిత్రక ప్రాధాన్యతను పునరుద్ధరించడానికే ఈ మార్పు జరిగిందని వెల్లడించారు. ఈ నామకరణ మార్పు భవిష్యత్తులో ఈ ప్రాంత రక్షణ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారబోతోంది.

మరోవైపు అమెరికా సైనిక విభాగానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ నిర్వహణలో తీవ్ర లోపం వెలుగుచూసింది. వెబ్‌సైట్‌లోని 'ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ’ మ్యాప్ విభాగంలో భారతదేశానికి చెందిన వివాదాస్పద మ్యాప్ ను ప్రదర్శించారు. అందులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాన్ని పాకిస్తాన్ భూభాగంలో కలిపి చూపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంతో పాటు అమెరికా నిర్ణయంపై భారత్‌లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దీనిపై స్పందిస్తూ, "క్వాడ్ కూటమి శవపేటికపై పడిన మరో మేకు ఇది?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications