ఇరాన్ డ్రోన్ లను కూల్చేసిన అమెరికా.. హార్మూజ్ వద్ద టెన్షన్.. టెన్షన్..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా- ఇరాన్ ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. నాలుగు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇటీవల చర్చలకు రావాలని పలుమార్లు ఇరాన్ కు అమెరికా సందేశం పంపినప్పటీకీ ఇరాన్ వాటిని పెడచెవిన పెట్టింది. తాజాగా హార్మూజ్ జలసంధి సమీపంలో రెండు ఇరాన్ డ్రోన్ లను అమెరికా కూల్చి వేసింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం ధ్రువీకరించింది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఈ డ్రోన్ ల వల్ల ముప్పు పొంచి ఉందని భావించి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ ఘటన జరగడానికి ఒకరోజు ముందే ఇరాన్ కు చెందిన నాలుగు అటాక్ డ్రోన్ లను అమెరికా సైన్యం కూల్చివేసింది. ఆ తర్వాత ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై కూడా దాడులు చేసింది. ఇలా వరుసగా హార్మూజ్ జలసంధి వద్ద మరోసారి ఇరు దేశాల మధ్య దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురు, సహజవాయువు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే ప్రయాణం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొంటున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అటు కువైట్, బహ్రెయిన్ లపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు, అలాగే అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న వరుస ప్రతి దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు మరింత బలహీనపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా తరఫున ఇరాన్ అధికారులతో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ టెహ్రాన్ కు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications