విరుచుకుపడుతున్న అమెరికా- భారీగా వైమానిక దాడులు
భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ పై అమెరికా విరుచుకుపడింది. సిరియాలోని ఐసిస్ స్థావరాలను మట్టుబెడుతోంది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు ఇద్దరు అమెరికన్లను హతమార్చినందుకు ప్రతీకారంగా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు, మంత్రి పీటర్ హెగ్సెత్ అధికారికంగా ప్రకటించారు. సిరియాపై దాడులు చేపట్టిందని వెల్లడించారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామని స్పష్టం చేశారు.
సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి అమెరికా "ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్"ను ప్రారంభించింది. అమెరికా దళాలపై డిసెంబర్ 13న పాల్మైరాలో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలను డొనాల్డ్ ట్రంప్, పీటర్ హెగ్సెత్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్ ద్వారా ఐసిస్ ఉగ్రవాదులు, వారి శిబిరాలు, ఆయుధ స్థావరాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇది యుద్ధానికి ఆరంభం కాదని, ప్రతీకార చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అమెరికన్లను రక్షించడానికి ఎన్నటికీ వెనుకాడబోమని, ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని హెగ్సేత్ పునరుద్ఘాటించారు. ఎక్కడైనా అమెరికన్లను లక్ష్యంగా చేసుకునేవారికి స్పష్టమైన హెచ్చరికలను ఆయన జారీ చేశారు. అమెరికన్లపై దాడులు చేసే వారికి తాము వేటాడతామని, అంతమొందించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇప్పుడు సిరియాలోనూ అలాంటి ప్రతీకార దాడులే చేపట్టామని అన్నారు.
ఇప్పటికే తమ శత్రువులను వేటాడి, చాలా మందిని అంతమొందించామని, ఈ చర్యను కొనసాగిస్తామని పీటర్ హెగ్సేత్ స్పష్టం చేశారు. ఇకపై ఉగ్రవాదులు తమ జీవితం మొత్తం కూడా భయం భయంతో గడుపుతారని హెచ్చరించారు. ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా వెల్లడించారు. ఉగ్రవాదులు గతంలో ఎన్నడూ లేనంత గట్టి దెబ్బను ఎదుర్కొంటారని అన్నారు. సిరియాలో ఐసిస్ చేతిలో అమెరికన్లు అమరులు అయ్యారని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని పేర్కొన్నారు.
అమెరికన్లపై దాడులకు బాధ్యులైన హంతక ఉగ్రవాదులపై చాలా తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సిరియాలో ఐసిస్ కంచుకోటలపై దాడులు చేస్తున్నామని, ఐసిస్ ను నిర్మూలించితే రక్తంతో తడిసిన ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియాకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కష్టపడే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. తమదేశంపై దాడి చేసినా లేదా బెదిరించినా ఉగ్రవాదుల భరతం పడతామని అన్నారు.












Click it and Unblock the Notifications