ట్రంప్ అందులో కరెక్ట్! ఇందులో రాంగ్ ! తాజా సర్వేలో అమెరికన్ల షాకింగ్..!
అమెరికా అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా తన వలస విధానాలతో పలు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అలాగే సుంకాల హెచ్చరికలతో వాణిజ్య వర్గాల్లోనూ వణుకుపుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ విధానాలపై ఆయనకు తాజాగా ఓటేసిన అమెరికన్లు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు అసోసియేటెడ్ ప్రెస్ సర్వే నిర్వహించింది.
ఇందులో మెజార్టీ అమెరికన్లు ట్రంప్ వలసలు, వాణిజ్యంపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టేశారు. ఇందులో ట్రంప్ వలస విధానాలను దాదాపు సగం మంది అమెరికన్లు సమర్దిస్తున్నట్లు తేలింది. ట్రంప్ అధికారంలోకి రాగానే భారీ ఎత్తున అక్రమ వలసల్ని వారి స్వదేశాలకు పంపేయడంతో పాటు సక్రమ వలసల్ని సైతం తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు. అయినా ట్రంప్ వలస విధాన నిర్ణయాల్ని మెజార్టీ అమెరికన్లు సమర్థిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

అయితే ట్రంప్ వాణిజ్య విధానాలను మాత్రం అమెరికన్లలో ప్రతీ 10 మందిలో నలుగురు మాత్రమే సమర్థిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా అమెరికాకు సుదీర్గ కాలంగా మిత్రపక్షాలుగా ఉంటున్న దేశాల్ని సైతం సుంకాలు విధిస్తామనే బెదిరింపులకు దిగడాన్ని వారు సమర్ధించడం లేదు. దీనికి తాజాగా చోటు చేసుకుంటున్న వినియోగదారుల విశ్వాసం తగ్గడం, స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన హెచ్చుతగ్గుల్ని కారణంగా చూపుతున్నట్లు తేలింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఈ విషయంలో విఫలమవుతున్నట్లు అమెరికన్లు అభిప్రాయ పడుతున్నారు.
వాస్తవానికి గతంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉండగా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అప్పట్లో అమెరికన్లలో ప్రతీ 10 మందిలో ముగ్గురు మాత్రమే ఆయన్ను ఈ విషయంలో సమర్థించారు. ఇప్పుడు ట్రంప్ కు సైతం నలుగురే మద్దతిస్తుండటం చూస్తుంటే ప్రభుత్వం మారినా ఈ విషయంలో ఎలాంటి మార్పూ లేదని అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications