• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్ట్రిక్ వెహికల్‌తో పర్యావరణానికి హాని ఎంత, భారీ లిథియం గనులున్న ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆస్ట్రేలియా

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ స్టోరేజీకి పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా లిథియంను సప్లయి చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. ఇది శిలాజ ఇంధనాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. కానీ, లిథియం గనుల తవ్వకాలు ఎంతవరకు పర్యవరణ అనుకూలం అన్న ప్రశ్న ఎదురవుతోంది.

పశ్చిమ ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి దక్షిణంగా మూడు గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళితే, సౌత్ వెస్ట్రన్ హైవే పక్కన, చారిత్రాత్మక మైనింగ్ పట్టణం గ్రీన్‌బుషెస్ వెనుక ఉన్న ప్రాంతంలో భూమిపై విస్తారమైన, లోతైన భూడిద రంగు గొయ్యి కనిపిస్తుంది.

అదొక పాత తగరపు గని. దాన్ని కార్న్‌వాల్ పిట్ అంటారు. 1888లో అక్కడ ఒక పౌండ్ తగరం దొరికింది. అప్పటి నుంచి ఒక శతాబ్దం పాటు అక్కడ తగరం తవ్వకాలు కొనసాగాయి. రాను రాను గనులు తవ్వే పద్ధతులు మారాయి. ఓపెన్-కట్ మైనింగ్ ప్రారంభమైంది.

దాంతో, 1980లో గ్రీన్‌బుషెస్ ప్రాంతంలో మరొక లోహం బయటపడింది. అదే లిథియం. గని యజమానులకు వెండిలా తెల్లగా, మృదువుగా ఉండే క్షార లోహం భౌగోళిక వింతల్లో ఒకటిగా తోచింది.

1983లో ఇక్కడ చిన్న తరహా మైనింగ్ ప్రారంభమైంది. ఈ లిథియంను గాజు తయారీ, ఉక్కు, సిరామిక్, లూబ్రికెంట్స్, లోహ మిశ్రమాలు వంటి పరిశ్రమలలో ఉపయోగించేవారు.

కొన్ని దశాబ్దాల తరువాత, వాతావరణ మార్పుల ప్రభావాల గురించి మాట్లాడుతున్న సమయంలో, పెట్రోల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వాలు కోరుతుండడం, దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తుండడంతో గ్రీన్‌బుషెస్‌లో లిథియం గని కొత్తగా ప్రాముఖ్యం సంతరించుకుంది.

నేడు కార్న్‌వాల్ తగరపు గొయ్యి వ్యాపార అవసరాలకు మూతబడింది. గ్రీన్‌బుషెస్ ప్రపంచంలో అతిపెద్ద లిథియం గనిగా అవతరించింది.

లిథియం

అతిపెద్ద లిథియం సరఫరాదారు

రెండేళ్లల్లో ఆస్ట్రేలియన్ స్పాడ్యుమీన్ ధరలు పదింతలు పెరిగాయి. స్పాడ్యుమీన్ అనేది లిథియం అధికంగా ఉండే ముడి పదార్థం. దీన్ని శుద్ధిచేసి ల్యాప్‌టాప్, ఫోన్, ఈవీ బ్యాటరీలలో వాడతారు.

2040 నాటికి ప్రపంచ దేశాలు పారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవాలంటే లిథియం డిమాండ్ 40 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా అతిపెద్ద లిథియం సరఫరాదారుగా అవతరించింది.

అయితే, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి లిథియం ఒక ప్రత్యామ్యాయం అయినప్పటికీ, లిథియం తవ్వకాలు ఎంతవరకు పర్యావరణ అనుకూలం? ఇదీ ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

2021లో, గ్రీన్‌బుషెస్‌లో తవ్విన లిథియం మాత్రమే ప్రపంచ ఉత్పత్తిలో 5వ వంతు కంటే ఎక్కువగా తూగింది. ఇది ఇంకా పెరుగుతుందని అంచనా.

2019లో ఈ గని యజమానికి లిథియం సైట్ పరిమాణాన్ని రెట్టింపు చేసేందుకు అనుమతి లభించింది. ఇది పూర్తయితే 2.6 కిమీ పొడవు, 1 కిమీ వెడల్పు, 455మీటర్ల (1,490 డుగుల) లోతు ఉంటుంది.

గ్రీన్‌బుషెస్ కాకుండా పశ్చిమ ఆస్ట్రేలియాలో మరో నాలుగు లిథియం గనులు ఉన్నాయి. ఆరవది ఉత్తర ఆస్ట్రేలియాలో డార్విన్ పక్కన ఉంది. దీని ఆపరేషన్ 2022 అక్టోబర్‌లో ప్రారంభమైంది. మరో రెండు గనులు అభివృద్ధి దశలో ఉన్నాయి.

2021లో ప్రపంచంలోని దాదాపు సగం లిథియం ఈ గనుల నుండే సరఫరా అయింది.

ఉప్పునీటి గుంటల నుంచి లిథియం ఉత్పత్తి

ఆస్ట్రేలియ తరువాత చీలీ, చైనాలు ఎక్కువ లిథియంను సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు ఉప్పునీటి గుంటల నుంచి లిథియం ఉత్పత్తి చేస్తున్నాయి.

రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది మారుతుంది. దక్షిణ అమెరికాలో లిథియం ట్రయాంగిల్ అని పిలిచే చీలీ, అర్జెంటీనా, బొలీవియా లిథియం ఉత్పత్తిదారులుగా ఎదుగుతాయి.

ఈ మూడు దేశాల్లో ప్రపంచంలోని అధిక లిథియం వనరులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ దేశాల నుంచి లిథియం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా.

చిలీలో మాత్రమే ప్రపంచంలో 10 శాతం లిథియం వనరులు ఉన్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో నాలుగొంతులు చిలీ నుంచే వస్తోంది.

బొలీవియాలో ప్రపంచంలోని 24 శాతం లిథియం నిల్వలు, అర్జెంటీనాలో 21 శాతం నిల్వలు ఉన్నాయి. అయితే, ఈ దేశాల్లో ఉత్పత్తి ఇంకా జోరందుకోలేదు.

ఈ దేశాలన్నీ లిథియంను గట్టి రాళ్లు (హార్డ్ రాక్) లేదా ఉప్పు నీటి గుంటల నుంచి సంగ్రహిస్తున్నాయి.

"హార్డ్ రాక్ నుంచి లిథియంను సంగ్రహిస్తే, పర్యావరణ ప్రభావాల పరంగా మిగతా గనుల తవ్వకాలకు, దీనికి తేడా లేదు. కానీ, ఉప్పు నీటి గుంటలు పూర్తిగా వేరు" అని గావిన్ మడ్ చెప్పారు. గావిన్ మడ్ మెల్బోర్న్‌లోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, ఆస్ట్రేలియా మైనింగ్ పరిశ్రమను పర్యవేక్షించే స్వతంత్ర సంస్థ మినరల్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

లిథియం మైనింగ్ గురించి చాలా అపోహలు ఉన్నాయని ఆయన అన్నారు. ఉదాహరణకు, లిథియం అరుదైన వనరు కాదని నిర్థరణ అయినా, ఇప్పటికీ చాలామంది అది అరుదనే అమ్ముతున్నారని గావిన్ మడ్ చెప్పారు.

లిథియం గనుల విషయంలో ఆస్ట్రేలియకు , దక్షిణ అమెరికా దేశాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్నాయని, అందువల్ల పర్యావరణ ప్రభావాలు కూడా భిన్నంగా ఉంటాయని ఆయన వివరించారు.

చిలీ, అర్జెంటీనా లాంటి దేశాల్లో ఎత్తులో ఉన్న ఉప్పు నీటి గుంటల అడుగున లిథియం ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియాలో లిథియం నిక్షేపాలు వందల యేళ్ల క్రితం భూగర్భంలో ఏర్పడ్డవి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బరా, యిల్గార్న్ క్రటాన్‌ (కోట్ల సంవత్సరాలకు పైగా స్థిరంగా ఉన్న ఖండాంతర శిలలు), నార్తర్న్ టెరిటరీలోని పైన్ క్రీక్ ప్రావిన్స్, క్వీన్స్‌లాండ్‌లోని జార్జ్‌టౌన్ ప్రాంతం, సెంట్రల్ విక్టోరియా మొదలైన ప్రాంతాలలో పురాతన లిథియం నిక్షేపాలు ఉన్నాయి.

శుద్ధి ప్రక్రియ పర్యావరణహితం కాదు

ఈ లోహాన్ని శుద్ధి చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

అయితే, ఆస్ట్రేలియాలో లిథియంను వెలికితీసే ప్రక్రియ, ఇతర రకాల లోహాల మైనింగ్‌ కన్నా భిన్నం కాదని జియోసైన్స్ ఆస్ట్రేలియాలో మినరల్స్ అడ్వైజ్ డైరెక్టర్ అల్లిసన్ బ్రిట్ చెప్పారు. వనరు ఉన్నచోట ఉపరితలాన్ని క్లియర్ చేసి, రాయిని బ్లాస్ట్ చేస్తారు. తరువాత ప్రాసెస్ చేస్తారని ఆయన వివరించారు.

సౌత్ అమెరికాలో ఉప్పు నీటి గుంటల అడుగున లిథియం ఇతర ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది. గుంటల్లోంచి నీటిని బయటకు పంప్ చేసి, సూర్యరశ్మి కింద అది ఎండిపోయేంతవరకు వేచి చూసి ఆ తరువాత లిథియంను సంగ్రహిస్తారు.

ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు 418,000 గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. లీకేజీ, నీరు చిందడం లాంటి రిస్కులు ఇందులోనూ ఉన్నాయి.

పై విధంగా రెండు పద్ధతుల్లో లిథియంను సంగ్రహించిన తరువాత, దాన్ని మరింత శుద్ధి చేసి వాడుకకు అనుగుణంగా తయారుచేస్తారు.

ఉప్పు నీటి గుంటల నుంచి సంగ్రహించిన ముడి పదార్థం లిథియం హైడ్రాక్సైడ్‌గా మార్చడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. బ్యాటరీలలో లిథియం హైడ్రాక్సైడ్‌ వాడతారు.

ఆస్ట్రేలియాలో గనుల నుంచి వెలికి తీసిన రాళ్లను పొడి చేసి, కాల్చి స్పాడ్యుమీన్ తయారుచేస్తారు. సుమారు 6 శాతం లిథియం కలిగిన ఈ పదార్థాన్ని శుద్ధి ప్రక్రియ కోసం ఆస్ట్రేలియా నుంచి చైనాకు రవాణా చేస్తారు. ప్రపంచంలో 60 శాతం లిథియం, 80 శాతం లిథియం హైడ్రాక్సైడ్ చైనాలో శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి అవుతాయి.

కాగా, ఇటీవల పశ్చిమ ఆస్ట్రేలియా స్థానికంగా శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశలో యోచిస్తోంది. ప్రస్తుతం ఈ దిశలో మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, ఈ శుద్ధి ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

"కర్బన ఉద్గారాల నుంచి విముక్తి పొందేందుకు లిథియం లాంటి లోహాలను ఉపయోగించడం తప్ప వేరే గత్యంతరం లేదు. కానీ, ఈ లోహాల ఉత్పత్తి కూడా పర్యావరణానికి హాని చేసేదే. ఆస్ట్రేలియాలో లిథియం ఉత్పత్తి పెరగడాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం" అని కన్వర్సేషన్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాగీ వుడ్ అన్నారు.

ఉదాహరణకు, ఫిన్నిస్ లిథియం ప్రాజెక్ట్ గని అవక్షేపాలు సమీపంలోని సముద్రపు పాయలను కలుషితం చేశాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తుఫాన్లు, భారీ వర్షాలు సంభవించే ప్రాంతాలలో లిథియం నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

2030 నాటికి ఒక కోటి టన్నుల CO2 ఉద్గారాలు హార్డ్-రాక్ లిథియం మైనింగ్ వల్ల వెలువడతాయని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. అయితే, శుద్ధి ప్రక్రియ కోసం విదేశాలకు పంపించకుండా, గనులకు దగ్గరగా శుద్ధి కర్మాగారాలను నిర్మిస్తే రవాణా ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను చాలావరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు, లిథియం ఉత్పత్తి అమాంతంగా పెరిగిపోతే, డిమాండ్ కన్నా సప్లయి ఎక్కువయితే లిథియం నిల్వలు పెరిగిపోతాయని, అప్పుడు బ్యాటరీ వేస్టేజీ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లిథియం ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి వ్యవస్థలను, చట్టాలను రూపొందించాలని వారు పిలుపునిస్తున్నారు. అలాగే, లిథియం బ్యాటరీస్ రీసైకిలింగ్ గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
What is the harm to the environment with electric vehicles, what is happening in Australia with huge lithium mines?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X