వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునక్ ఎవరు, ఆయనకూ భారతదేశానికీ ఉన్న అనుబంధం ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునక్

రిషి సునక్ బ్రిటన్‌కు తొలి భారత/ఆసియా సంతతి ప్రధాని కాబోతున్నారు. తమ తదుపరి నేత ఆయనే అని కన్సర్వేటివ్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

బ్రిటన్ 57వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న 42 ఏళ్ళ రిషి సునక్, 1812లో ప్రధాని అయిన లార్డ్ లివర్ పూల్ తరువాత ఆ స్థాయికి ఎదిగిన అత్యంత చిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించారు.

అంతేకాదు, తొలిసారి ఎంపీ అయిన తరువాత బ్రిటన్ తాజా చరిత్రలో అత్యంత వేగంగా ప్రధాని పదవిని అందుకున్నది కూడా ఆయనే. కేవలం ఏడేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ప్రధాని పదవిని గెల్చుకున్నారు.

ఆయన మంగళవారం నాడు పదవీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తున్నాయి.

పూర్వీకులది పంజాబ్

రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు.

ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పని చేశారు. తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు.

2005లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఐ చదువుతోన్న సమయంలో ఆయన అక్షతా మూర్తిని కలిశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేశారు.

ఆ తర్వాత 'ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్, థెలెమ్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా పనిచేశారు.

అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆయనకు క్రికెట్, ఫుట్‌బాల్, ఫిట్‌నెస్, సినిమాలంటే ఇష్టమని తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.

మార్పు కోసమే రాజకీయాల్లోకి...

స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గెలిచినప్పుడు బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులలో ఒకరిగా రిషి సునక్ గుర్తింపు పొందారు.

రిషి సునక్

బ్రిటన్‌లో అత్యంత చిన్న వయస్సుడైన చాన్స్‌లర్‌గా 2020 ఫిబ్రవరిలో నియమితులైన తర్వాత రిషి సునక్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రికి రాత్రే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఆయనను ప్రజలు ముద్దుగా 'డిషీ రిషి' అని పిలుచుకునేవారు. కరోనా మహమ్మారి సమయంలో రిషి సునక్ రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా ఆయనకు మరింత ప్రజాదరణ దక్కింది.ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కర్ణాటకు చెందిన ఎన్‌ఆర్ నారాయణ, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని రిషి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

భార్య అక్షతా మూర్తితో రిషి సునక్

సునక్ రాజకీయ ప్రయాణం

42 సంవత్సరాల సునక్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాచ్స్‌కు విశ్లేషకుడు. 2015లో నార్త్ యార్క్‌షైర్ నియోజకవర్గం రిచ్‌మండ్‌కు ఎంపీ కావడానికి ముందు రెండు హెడ్జ్ ఫండ్స్‌లో పార్ట్‌నర్‌గా ఉన్నారు.

ఒకప్పుడు జాన్సన్ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధాన మంత్రి పదవకి ప్రధాన పోటీదారుగా కనిపించారాయన.

2020 ఫిబ్రవరి లో ఛాన్సలర్‌గా నియమితులైన సునక్ కోవిడ్-19 మహమ్మారి పరిణామాలతో పోరాడవలసి వచ్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా కృషి చేశారని చెబుతారు.

ఆయన భార్య ఆదాయ పన్ను వ్యవహారాలు వివాదం కావడం, కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా పడటంతో ఆయన ప్రతిష్ట దెబ్బతింది.

జూన్ 2020లో ప్రధాని పుట్టినరోజు వేడుకకు హాజరై కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రధాని జాన్సన్,ఆయన భార్య క్యారీలతోపాటు సునక్‌కు మెట్రోపాలిటన్ పోలీసులు జరిమానా విధించారు.

జాన్సన్‌కు విధేయుడిగా పేరున్న తన సహచరుడు జావిద్‌తో కలిసి రాజీనామా చేయడంతో వారి మధ్య సంబంధాలు చెడిపోయాయి.

సునక్, జావిద్ రాజీనామాల తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేయడం ప్రారంభించారు. దీంతో జాన్సన్ ప్రధానమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది.

'నేను హిందువునే...'

తాను హిందువునని రిషి సునక్ ప్రకటించారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

అలా పూజలు చేసిన వారిలో 75 ఏళ్ల నరేశ్ సొంచట్ల ఒకరు. రిషి సునక్ స్వస్థలమైన సౌతంప్టన్‌కు చెందిన నరేశ్, తనకు రిషి చిన్నతనం నుంచి తెలుసని చెప్పారు. 'రిషి ప్రధాని మంత్రి అవుతాడని అనుకుంటున్నా. కానీ, కాకపోవచ్చు. ఆయన ఒంటి రంగే అందుకు కారణం' అని నరేశ్ సెప్టెంబర్ నెలలో బీబీసీతో అన్నారు.

అప్పుడు బీబీసీ ఇండియా బృందం బ్రిటన్‌లో పర్యటిస్తున్నప్పుడు నరేశ్ వంటి ఆసియా సంతతి ప్రజల్లో ఒకరకమైన ఆందోళన కనిపించింది. రిషి సునక్ ఒంటి రంగు ఆయన ప్రధాని కావడానికి అవరోధం కావొచ్చని వారు భయపడ్డారు. కానీ, వారి భయాలు ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఆసియా సంతతి నేతను ప్రధానిగా ఎంచుకునే స్థాయికి కన్సర్వేటివ్ పార్టీ ఇంకా రాలేదనే విమర్శలకు కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది.

రిషి సునక్

వివాదాల్లో కూడా...

కోవిడ్-19 వ్యాప్తి ముందువరకు మీడియాలో రిషికి మద్దతుగా వార్తలు వచ్చేవి. కానీ, మహమ్మారి వ్యాపించిన సమయంలో కొన్ని వివాదాలకు ఆయన కేంద్ర బిందువయ్యారు.

స్టాన్‌ఫర్డ్‌లో చదివేటప్పుడే నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె అక్షతా మూర్తిని రిషి కలిశారు. పెళ్లి తర్వాత కూడా అక్షతా మూర్తి తన భారత పౌరసత్వాన్ని అట్టిపెట్టుకున్నారు. దీంతో బ్రిటన్‌లో ఆమెకు నాన్-డొమిసైల్ రిసిడెంట్ హోదా ఉండేది. అంటే బ్రిటన్ వెలుపలి ఆదాయంపై ఏడాదికి 30,000 పౌండ్లు (రూ.28.81 లక్షలు) చెల్లిస్తే ఇక ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో చాలా మంది రిషి దంపతులను విమర్శించడం మొదలుపెట్టారు.

విదేశాల్లో సంపాదించిన ఆస్తులపై బ్రిటన్‌లో పన్నులు చెల్లిస్తానని అక్షతా మూర్తి వివరణ కూడా ఇచ్చారు.

ఏప్రిల్ 2022లో రిషికి అమెరికా శాశ్వత పౌరసత్వాన్నిచ్చే గ్రీన్ కార్డు ఉందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో చాన్సెలర్‌గా పనిచేస్తూ అక్కడి పౌరసత్వం ఉండటమేంటని మరో వివాదం కూడా చెలరేగింది.

అయితే, ప్రభుత్వ అధికారిగా తొలిసారి అమెరికాకు వెళ్లినప్పుడే అక్కడి గ్రీన్ కార్డును వెనక్కి ఇచ్చేసే ప్రక్రియలను రిషి మొదలుపెట్టారని ఆయన అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.

సెప్టెంబర్‌లో ఓటమి, అక్టోబర్‌లో విజేత

బ్రిటన్ ప్రధాని పదవి కోసం సెప్టెంబర్ నెలలో జరిగిన రేసులో రిషి సునక్ ఓడిపోయారు. బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో బ్రిటన్ ఆర్థికమంత్రిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ అది ఆయనను విజయతీరాలకు చేర్చలేక పోయింది.

రిషి సునక్ ప్రత్యర్థి లిజ్ ట్రస్, 81,326 ఓట్లతో కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. 57 శాతం ఓట్లను ఆమె గెలుచుకున్నారు.

రిషి సునక్‌కు ఓట్లు 60,399 వచ్చాయి.

ఈ రేసులో గెలిచి ఉంటే రిషి సునక్ చరిత్ర సృష్టించి ఉండేవారని, బ్రిటన్‌కు ప్రధాని అయిన తొలి నాన్-వైట్ వ్యక్తిగా నిలిచి ఉండేవారని అప్పట్లో విశ్లేషకులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయునిగా 2008లో చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా మాదిరిగా రిషి సునక్ విజయం ఒక కొత్త చరిత్రను లిఖించి ఉండేదని కూడా అన్నారు.

నెల రోజులు గడిచిన తరువాత సునక్‌కు ఆ అవకాశం రానే వచ్చింది. ఈసారి విజయం రిషి సునక్‌ను వరించింది. బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతున్న తొలి భారతీయ/ఆసియా సంతతి వ్యక్తిగా ఆయన ఇప్పుడు చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Who is Rishi Sunak and what is his connection with India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X