అంతా మీ వల్లే: నవాజ్ దుమ్ము దులిపిన పాక్ పత్రిక
ఇస్లామాబాద్: మన ప్రభుత్వం మసూద్ అజహర్, హఫీజ్ సయీద్‌ల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్ మీడియా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రశ్నించింది. డాన్ పత్రిక ఇప్పటికే.. పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయని సంచలన వార్త వెలుగులోకి తెచ్చింది.

వారిపై చర్యలేవి
ఆ తర్వాత ది నేషన్ అనే పత్రిక.. అజహర్, సయీద్‌ల పైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించింది. డాన్ పత్రిక జర్నలిస్ట్ అల్మిద్ కథనం అసత్యాలు, ఊహాగానాలుగా పేర్కొన్న ప్రభుత్వం నిషేధిత వ్యక్తులు పాక్‌లో స్వేచ్ఛగా ఎలా సంచరిస్తున్నారు? ఎలా పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారు? అనే అంశాల్ని మాత్రం వెల్లడించలేదని సూటిగా ప్రశ్నించింది.

ఉగ్రవాదుల వల్ల మనం ఏకాకి
మసూద్ అజార్, హఫీజ్ సయీద్ వంటి వారి కారణంగా దేశం ఏకాకిగా మారుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. 'మిత్రులను.. తటస్తులను ఏవిధంగా కోల్పోతున్నాం' అనే శీర్షికతో ది నేషన్ పత్రిక ఎడిటోరియల్ రాసింది.

వారిపై చర్యలు తీసుకోవాలి
అజహర్, సయిద్ వంటివారు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం, సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పేర్కొంది. అదే సమయంలో ఉగ్రవాదులు ఏదైనా సమస్య సృష్టించినప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి తామెంత కష్టపడుతోంది వివరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పత్రికల సంచలనాలు
కాగా, ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయనే కథనం రాసినందుకు డాన్ పత్రిక జర్నలిస్టు సిరిల్ అల్మీద్‌పై నిషేధం విధించిన తర్వాతి రోజే ది నేషన్ పత్రికలో తాజా సంచలన కథనం రావటం గమనార్హం. ఇదిలా ఉండగా, హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్, ఎల్‌ఈటీ వంటి ఉగ్రసంస్థల విషయంలో ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న అంతరాన్ని డాన్ పత్రిక ఎండగట్టింది.












Click it and Unblock the Notifications