చైనా నిజస్వరూపం ఇదీ: కరోనా మరణాల లెక్కింపులో పొరపాటు వుహాన్ మృతుల్లో 50 శాతం అధికంగా..
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మాతృదేశం చైనా.. కరోనా మరణాల సంఖ్య పునఃసమీక్షించుకుంది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో కొత్తగా భారీ పెరుగుదల చోటు చేసుకుంది. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో ఇదివరకు మరణించిన వారి సంఖ్యను 50 శాతం వరకు పెంచేసింది. ఒక్క వుహాన్‌లో మరణించిన వారి సంఖ్యలో కొత్తగా 1290 మందిని చేర్చింది. ఫలితంగా- ఆ దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4632కు చేరింది.
Recommended Video

లెక్కల్లో పొరపాటు దొర్లిందంటూ..
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వుహాన్‌లోనే అత్యధిక మరణాలు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా వెల్లడించింది. దేశం మొత్తం మీద నమోదైన కరోనా మృతుల సంఖ్యతో పోల్చుకుంటే.. వుహాన్‌లోనే సగానికి పైగా మరణించినట్లు తెలియజేసింది. ఇదివరకు నమోదు చేసిన మరణాల సంఖ్యను సవరించాల్సి వచ్చిందని ఆరోగ్య కమిషన్ అధికారులు వెల్లడించారు. కొత్తగా 1290 మందిని ఈ జాబితాలో చేర్చినట్లు చెప్పారు. అప్పట్లో మరణాల లెక్కలు, మృతుల వివరాలను సేకరించడంలో పొరపాటు దొర్లిందని స్పష్టం చేశారు.

లెక్క తేల్చడంలో గందరగోళం..
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వుహాన్‌లో దాని బారిన పడి మరణించిన వారి సంఖ్యను లెక్క గట్టడంతో పొరపాటు దొర్లిందని తాజాగా హెల్త్ కమిషన్ అధికారులు వెల్లడించారు. వుహాన్‌లో ఇదివరకు నమోదైన మరణించిన వారి సంఖ్యను గుర్తించడంలో గందరగోళం చోటు చేసుకుందని చెప్పారు. ఫలితంగా మరణాల సంఖ్యను సరిగ్గా లెక్క తేల్చలేకపోయామని చెప్పారు. ఇదివరకు చనిపోయిన వారి కంటే 1290 మంది అధికంగా మరణించినట్లు తాజాగా ధృవీకరించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా చేర్చిన లెక్కల ప్రకారం..
కొత్తగా చైనా జాతీయ హెల్త్ కమిసన్ అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 4632. ఇదివరకు ఈ సంఖ్య 3,300ల వరకు మాత్రమే ఉండేది. కరోనా మరణాలను లెక్క గట్టడంలో తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు హెల్త్ కమిషన్ అధికారులు వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వారు స్పష్టం చేశారు. మొత్తం హ్యూబే ప్రావిన్స్‌లో కూడా మరణాల సంఖ్యను పునఃసమీక్షిస్తామని తెలిపారు.

అడవి జంతువులను కూడా వదల్లేదంటూ..
ఈ సందర్భంగా కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వుహాన్‌లో వైరస్ పుట్టుకకు కారణమైన హ్యునన్ సీఫుడ్స్ మార్కెట్‌లో అటవీ జంతువుల మాంసాన్ని కూడా విక్రయించారని నిర్ధారించినట్లు తెలుస్తోంది. నిషేధించిన అడవి జంతువుల మాంసాన్ని ఈ సీఫుడ్స్ మార్కెట్లో అమ్మకానికి ఉంచారని, వాటిని పెద్ద ఎత్తున స్థానికులు కొనుగోలు చేశారని అంటున్నారు. నిషేధించిన అడవి జంతువుల మాంసాన్ని విక్రయించిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications