ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేళ- చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
అహ్మదాబాద్: ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ గ్రాండ్ గా ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఐపీఎల్ 2023 ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.
శుక్రవారం తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు. గుజరాత్ టైటన్స్‌కు ఇది హోం పిచ్. పైగా హార్దిక్ పాండ్యా లోకల్ క్రికెటర్ కావడం కలిసొచ్చే అంశం. హోం పిచ్ పై గుజరాత్ టైటన్స్ ఎలా చెలరేగుతుందనేది ఆసక్తిగా మారింది.

ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు చేదు వార్త అందింది. బౌలర్ ముఖేష్ చౌదరి.. జట్టుకు దూరం అయ్యాడు. ఈ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికీ అతను ఆడట్లేదు. బ్యాక్ పెయిన్ తో అతను బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ లో ఉంటున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ముఖేష్ చౌదరి స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు.
గత ఏడాదే ముఖేష్ చౌదరి ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎంట్రీ ఇచ్చాడు. సీఎస్‌కేలో కీలక బౌలర్ గా ఎదిగాడు. ఇప్పటివరకు 13 మ్యాచ్ లను ఆడిన ముఖేష్ చౌదరి- ఇప్పటివరకు 16 వికెట్లను పడగొట్టాడు. 4/46 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. ఇదివరకే మరో బౌలర్ కైలే జెమిసన్- కూడా బ్యాక్ పెయిన్ తో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఏస్ బౌలర్ కూడా ఆడకపోవడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలహీనపడినట్టే కనిపిస్తోంది. కైలె జెమిసన్ స్థానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగలాతో భర్తీ చేసింది ఫ్రాంఛైజీ.
కాగా- ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 10 జట్ల కేప్టెన్లు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఐపీఎల్ 2023 ట్రోఫీతో కలిసి గ్రూప్ ఫొట్ దిగారు. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం సాదాసీదాగా సాగిన విషయం తెలిసిందే. 2019, 2020, 2021, 2022 సీజన్లల్లో ఎలాంటి ఓపెనింగ్ కార్యక్రమాలను నిర్వహించలేదు.












Click it and Unblock the Notifications