IPL 2023 : బీసీసీఐ అరుదైన నిర్ణయం-ప్రతీ డాట్ బాల్ కూ 500 మొక్కలు..
ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్ దశకు వచ్చేసింది. ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ జరిగింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ ను చెన్నై మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ లో లక్నో, ముంబై జట్ల పోరులో గెలిచే జట్టుతో రెండో క్వాలిఫయర్ లో తలపడాల్సి ఉంది. ఇందులో గెలిచిన వారు ఫైనల్ కు చేరుకుంటారు. వీరితో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో తలపడబోతోంది.
అయితే ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా జరుగుతున్న రెండు క్వాలిఫయర్స్, ఓ ఎలిమినేటర్ మొత్తం మూడు మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ తాపాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా మొక్కలు నాటే ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో తాము కూడా ప్లే ఆఫ్స్ కు దీన్ని లింక్ చేసుకుంటూ ఆ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ప్లే ఆఫ్స్ లో పడే ప్రతీ డాట్ బాల్ కూ 500 మొక్కలు చొప్పున నాటాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ లో భాగంగా చెన్నై,గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మొత్తం 84 డాట్ బాల్స్ పడ్డాయి. వీటికి ఒక్కో బాల్ కూ 500 మొక్కల చొప్పున మొత్తం 42 వేల మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈసారి ఐపీఎల్ సీజన్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న టాటా సంస్ధల తరఫున ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రకటించారు. ఐపీఎల్ బ్యాటర్ల గేమ్ అని ఎవరు చెప్పారు, బౌలర్లూ అంతా మీ చేతుల్లోనే ఉందంటూ ట్వీట్ కూడా చేశారు.
బీసీసీఐ నిర్ణయంతో ఇవాళ లక్నో, ముంబై జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ తో పాటు ఈ మ్యాచ్ విజేతతో గుజరాత్ టైటాన్స్ తలపడే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లోనూ పడే డాట్ బాల్స్ కు ఒక్కో బంతికి 500 మొక్కలు చొప్పున నాటబోతున్నారు. తద్వారా బీసీసీఐ మంచి సందేశం పంపుతోందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పుడూ డబ్బుల కోసమే పాకులాడే బీసీసీఐ నుంచి వెలువడిన మంచి నిర్ణయం ఇది అని అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications