వైఎస్ వివేకా హత్య కేసు: ఏ5 దేవిరెడ్డికి నో బెయిల్, సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

రిమ్స్‌లో చికిత్స
అనారోగ్యం వల్ల కడప రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నానని, తన అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని దేవిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో దేవిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడని సీబీఐ తరఫు న్యాయవాది వివరించారు. వివేకా హత్యకు ఏకంగా రూ.40 కోట్లు సుపారీ ఇచ్చేందుకు దేవిరెడ్డి సిద్ధంగా ఉన్నాడని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లుగా దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

మరికొందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంది..
కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మరికొందరు ప్రముఖులను అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో దేవిరెడ్డికి బెయిల్ ఇస్తే.. సాక్షులు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని సీబీఐ లాయర్ వాదించారు. సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దేవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

జగన్ ఉండొచ్చని అనడంతో
ఇటు వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివేకా కుమార్తె సునీత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావుగా మారారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నుంచి రియాక్షన్స్ ప్రారంభం అయ్యాయి. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇవాళ సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నాడని పేర్కొన్నారు. మరి రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు. సజ్జల లాంటి నీచ క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications