కడపలో మంచు మనోజ్- భూమా అఖిలప్రియ చెల్లెలితో వివాహంపై- కొత్త జీవితం..!!
కడప: ప్రఖ్యాతి చెందిన కడప అమీన్ పీర్ దర్గాకు ప్రముఖల తాకిడి పెరుగుతోంది. ఈ దర్గాను దర్శించడానికి రాయలసీమ జిల్లాల నుంచే పొరుగునే తమిళనాడు, కర్ణాటకల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. మతాలకు అతీతంగా కడప పెద్ద దర్గాలో ప్రార్థనలు చేస్తుంటారు. ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ దర్గాను సందర్శించారు. సినీ నటులు అలీ, అభిషేక్ బచ్చన్, ఐశ్వరరాయ్, చిరంజీవి, నితిన్, రామ్‌చరణ్, అమీర్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు దర్గాను సందర్శించిన వారిలో ఉన్నారు.

రజినీకాంత్.. ఏఆర్ రెహ్మాన్..
గురువారం నాడే- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా కడప పెద్ద దర్గాను సందర్శించారు. ఈ నెల 12వ తేదీన తన 72వ పుట్టినరోజును జరుపుకొన్నారు తలైవా. ఈ సందర్భంగా ఆయన తొలుత తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున కుమార్తెతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా కడపకు వెళ్లి దర్గాలో ప్రార్థనలు చేశారు రజినీకాంత్.

మంచు మనోజ్..
ఆ మరుసటి రోజే- టాలీవుడ్ నటుడు మంచు మనోజ్- పెద్ద దర్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న ఆయనను ప్రతినిధులు సంప్రదాయబద్ధమైన కాషాయ తలపాగాను ధరింపజేశారు. ప్రార్థనల అనంతరం ఛాదర్‌ను సమర్పించారు. మంచు మనోజ్ వచ్చిన విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూడటానికి ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు.

కొత్త జీవితం..
అనంతరం మంచు మనోజ్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నానని అన్నారు. కొత్త సినిమాలు సెట్స్ మీద ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. సినిమాలను తీయడంలో కొంత విరామం వచ్చిందనే విషయాన్ని మంచు మనోజ్ అంగీకరించారు. ఇకపై ఆ గ్యాప్ రాబోదని తాను అభిమానులకు హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభిస్తానని, అదే సమయంలో సినిమాతో బిజీ కాబోతోన్నానని మంచు మనోజ్ అన్నారు.

భూమా మౌనికతో..
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికను త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నాడని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదివరకు ప్రణతిని పెళ్లి చేసుకున్నారాయన. అది విడాకులకు దారి తీసింది. ఇప్పుడు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications