కడప జిల్లాకు వైఎస్ జగన్: కంప్లీట్ షెడ్యూల్ ఇదే
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన షెల్యూడ్ ఖరారైంది. ప్రోగ్రామ్ మినిట్స్ వెలువడింది. ఇవ్వాళ, రేపు ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తారు. గురువారం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రి సమాధిని సందర్శిస్తారు. నివాళి అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్తారు. 4:30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, కడప మేయర్ సురేష్ బాబు, విప్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇతర పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతారు.

అనంతరం హెలికాప్టర్‌లో ఆయన ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమౌతారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. దీనికి సంబంధించి పార్టీ నేతలతో సమీక్షలను నిర్వహిస్తారు. ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ సమీక్షలో పాల్గొంటారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
గురువారం ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్ ఘాట్‌ను సందర్శిస్తారు. తండ్రికి నివాళి అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అరగంట పాటు అక్కడే గడుపుతారు వైఎస్ జగన్. తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతి, బాబాయ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమౌతారు. ఆ వెంటనే హెలికాప్టర్‌లో కడపకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
ఇదే కార్యక్రమానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయమే ఆమె ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తన అన్న వైఎస్ జగన్‌తో కలిసి వైఎస్ షర్మిల.. తండ్రి సమాధి వద్ద నివాళి అర్పిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తండ్రి వర్ధంతి కావడం వల్ల విజయమ్మతో కలిసి వారిద్దరూ వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తారని, ఆ తరువాత ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతారని సమాచారం.












Click it and Unblock the Notifications