నో కాంప్రమైజ్- వై నాట్ 175..!!
కడప: ప్రస్తుతం తన సొంత జిల్లా కడప పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుపతి, అన్నవరంలల్లో సెవెన్ స్టార్స్ హోటల్స్ నిర్మాణానికీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభపరిణామంగా అభివర్ణించారు.
అనంతరం ఆయన పులివెందులలో పర్యటించారు. పట్టణంలో 26.12 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. రాష్ట్రంలో రెండవ హాకీ టర్ఫ్ కోర్టును లాంఛనంగా ఆరంభించారు. ఈ అకాడమీలో హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖోఖో, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి.

పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అకాడమీలో వైఎస్ జగన్ కొద్దిసేపు స్పోర్ట్స్‌మెన్‌గా కనిపించారు. కొత్త ఆస్ట్రో టర్ఫ్‌పై హాకీ ఆడారు. ఆర్చరీ బ్లాక్‌లో వైఎస్ జగన్ విల్లు ఎక్కుపెట్టారు. గురి చూసి బాణాన్ని సంధించారు. అది గురి తప్పలేదు. టార్గెట్‌ను ఛేదించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రచ్చరచ్చ చేస్తోన్నాయి.

వైఎస్ జగన్ 175 నియోజకవర్గాలపై గురి పెట్టాడని, వాటిని ఛేదించి తీరుతాడంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కుప్పం, హిందూపురం సహా అన్ని నియోజకవర్గాలనూ కొట్టబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అనేది ఉండబోదని, ప్రతిపక్షాలకు బ్యాండ్ తప్పదంటూ జోస్యం చెబుతున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- వైఎస్ జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫొటోలు విడుదల కావడం వైసీపీ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసినట్టయింది.












Click it and Unblock the Notifications