బీటెక్ రవి అరెస్ట్: కేసు ఇదే
కడప: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీకెట్ రవి అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో నమోదైన పలు కేసుల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుకు సంబంధించిన కొన్ని వీడియోలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం విడుదల చేసింది.
రాత్రి పులివెందుల నుంచి కడపకు వెళ్తోండగా మార్గమధ్యలో యోగివేమన విశ్వ విద్యాలయం సమీపంలో బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నట్లు సమాచారం.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గతంలో కడప జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగిన కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేశారనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. నారా లోకేష్‌ను కలవనివ్వకపోవడంతో అప్పట్లో ఆయన కడప ఎయిర్‌పోర్ట్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వారిని దూషించారు. దీనిపై వల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో ఆయనకు పలుమార్లు నోటీసులను కూడా అందజేశారు పోలీసులు. వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. వాటిని బీటెక్ రవి పట్టించుకోలేదు. ఎలాంటి వివరణలనూ ఇవ్వలేదు. దీనితో బీటెక్ రవిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు.

బీటెక్ రవి అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించింది. 20 మంది దుండగులు కిడ్నాప్ చేశారని మండిపడింది. సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదని పేర్కొంది. బీటెక్ రవి అంటే ఎందుకు అంత భయం అంటూ ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications