స్వాగతం..సుస్వాగతం- టీడీపీ పోస్టర్లల్లో వైఎస్ సునీత: టికెట్ ఖరార్
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.
ఇదే కేసులో ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. తెలంగాణ హైకోర్టుకు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటీషన్ గడువు ఇవ్వాళ్టితో ముగిసిపోనుంది. దీనితో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్లు ఇవ్వాళ విచారణకు రానున్నాయి.

ఈ కేసులో సొంత కుటుంబంపైనే వైఎస్ సునీత న్యాయపోరాటం సాగిస్తోన్నారు. ఆమె వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారనేది బహిరంగ రహస్యం. కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బీటెక్ రవి ఇప్పటికే ఆమెకు మద్దతు పలికారు. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన ఆయన కారు డ్రైవర్ దస్తగిరి కూడా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.
టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఛానళ్లల్లో డిబేట్లల్లో సైతం పాల్గొంటోన్నారు దస్తగిరి. ఈ పరిణామాల మధ్య పులివెందులతో పాటు కడప జిల్లా రాజకీయాలపై పట్టు సాధించడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ సునీతను పార్టీలో చేర్చుకోవచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి టీడీపీ కండువాను కప్పుకోవడం ఇక లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ పరిణామాల మధ్య- తెలుగుదేశం పార్టీ పోస్టర్లల్లో వైఎస్ సునీత ఫొటో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలోని ప్రొద్దుటూరు టౌన్‌లో ఇవ్వాళ విస్తృతంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోనూ వాటిని అతికించారు. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం అనే అక్షరాలను ముద్రించారు.
ఈ పోస్టర్లల్లో పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి, ఇతర నాయకుల ఫొటోలను ముద్రించారు. ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డి, మరోవైపు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. వాటి మధ్య సునీత ఫొటోలను ప్రింట్ చేయించారు. ఈ ఫొటోలను ఎవరు అతికించారు? అనేది తెలియరావట్లేదు. దీనిపై టీడీపీ జిల్లాస్థాయి నాయకులెవరూ స్పందించట్లేదింకా.












Click it and Unblock the Notifications