కొండగట్టులో పెళ్లి చేసుకుని వస్తుంటే.. వరుడిపై దాడి, వధువు కిడ్నాప్
కరీంనగర్: హుజూరాబాద్‌లో ఓ నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ కారును అడ్డగించిన కొందరు వ్యక్తులు.. అందులోని యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అడ్డువచ్చిన నవ వరుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత యువతిని తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హన్మకొండకు చెందిన ఓ యువకుడు, మడికొండకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దల అంగీకరించలేదు. ఈ క్రమంలో లేచిపోయి పెళ్లి చేసుకుందామని ఈ జంట నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో బుధవారం యువతీ యువకుడు మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం బుధవారం రాత్రి హనుమకొండ వైపు కారులో బయల్దేరి వెళ్లారు. అయితే, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు నవదంపతుల కారు రాగానే.. మరో కారులో వచ్చిన యువతి బంధువులు వారిని అడ్డుకున్నారు.
సుమారు 15 మంది యువకుడిపై ఒక్కసారిగా దాడి చేశారు. అనంతరం నవ వధువును తమ కారులో ఎక్కించుకుని అక్కడ్నుంచి తీసుకెళ్లారు. అమ్మాయి తరపు బంధువుల దాడిలో తీవ్రంగా గాయపడిన అబ్బాయి సమీపంలోని పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశాడు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా, ఆ తర్వాత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications