అయోధ్య రాముడికి తెలంగాణ నుంచి మరో కానుక: సిరిసిల్ల బంగారు చీర
కరీంనగర్: అయోధ్య శ్రీరాముడికి తెలంగాణ తరపున మరో కానుక అందనుంది. సిరిసిల్ల నుంచి బంగారు చీరను పంపనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఈతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను కూడా ఆ చీరలో పొందుపర్చడం విశేషం.

Recommended Video

కాగా, 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. చీరను అద్భుతంగా తయారు చేశారని హరిప్రసాద్‌ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. అనంతరం ఆయనను శాలువాతో సంత్కరించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయంగా తన చేతులతో తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు. జనవరి 26న ప్రధాని మోడీకి చీరను అందించనున్నారని.. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతకు చేరుతుందన్నారు.
కాగా, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన చరిత్ర సిరిసిల్లదని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications