అధికారమే పరమావధి.. కేసీఆర్‌పై ఈటల నిప్పులు
సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బుధవారం ఆయన హాజరయ్యారు. కేసీఆర్ పని తీరును ఎండగట్టారు. ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తారని మండిపడ్డారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

డబ్బులు.. కుట్రలు
కేసీఆర్ కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారని ఈటల రాజేందర్ వివరించారు. హుజూరాబాద్ ప్రజల ప్రేమ ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పని చేయవని స్పష్టంచేశారు. ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నానని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడని.. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరని వివరించారు.

కోట్లు కుమ్మరించి
కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో నీ కుట్రలు సాగవు బిడ్డా అంటూ కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. హుజురాబాద్ బై పోల్ ఇంచార్జీలను కూడా బీజేపీ నియమించింది. జితేందర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.

విభేదాలు
ఈటల రాజేందర్, కేసీఆర్ మధ్య పొసగ లేదు. ఐదేళ్ల నుంచి అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇన్నాళ్లకు విభేదాలు బయటపడ్డాయి. మంత్రి పదవీ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. ఆ వెంటనే భూముల స్కాం అని తెరపైకి తీసుకొచ్చారు. పార్టీ నుంచి వెళ్లగొట్టే పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సతీసమేతంగా ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications