కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి 14న ప్రారంభం: సండే స్పెషల్, వంతెన ప్రత్యేకతలివే
హైదరాబాద్ తీగల వంతెన తర్వాత తెలంగాణ మరో ఆకర్షణీయమైన కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‍లో సిద్ధమైంది.
కరీంనగర్: హైదరాబాద్ తీగల వంతెన తర్వాత తెలంగాణ మరో ఆకర్షణీయమైన కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‍లో సిద్ధమైంది. ఏప్రిల్ 14న ఈ తీగల వంతెన ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభం చేయనున్నట్లు తెలిసింది.

కేసీఆర్ కాదు కేటీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
మొదట ఈ తీగల వంతెనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభింపజేయాలని భావించినప్పటికీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం, సెక్రటేరియట్ పనుల కారణంగా సాధ్యపడలేదని, అందుకే వంతెన ప్రారంభానికి కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్-కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7 కిలోమీటర్ల దూరం తగ్గించడం, ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఈ తీగల వంతెన నిర్మాణం చేపట్టింది.

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రత్యేకతలివే..
2018లో దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిగా విదేశీ ఇంజినీరింగ్ సాంకేతికతతో ఈ వంతెన నిర్మించారు. బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే ఆర్అండ్ బీ అధికారులు పలుమార్లు తనిఖీ చేశారు. ఏప్రిల్ 14న ప్రారంభానికి ముహూర్తం ఖరారైన క్రమంలో రూ. 8 కోట్ల వ్యయంతో వంతెనపై లైటింగ్ ఏర్పాట్లు వేగవంతం చేశారు. అంతేగాక, ఫుడ్ స్టాల్స్, మ్యూజిక్, కొరియా టెక్నాలజీతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, నాలుగు భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రారంభోత్సవం అనంతరం వాహనాలను బ్రిడ్జిపైకి అనుమతిస్తారు.

ఆదివారం ప్రజల ఆటవిడుపు కోసం కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి
అయితే, ప్రతి ఆదివారం మాత్రం వాహనాలకు అనుమతి ఉండదు. వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు సందర్శకులకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇటీవల కేబుల్ బ్రిడ్జి, ట్యాంక్ బండ్ రహదారిపై ఆదివారాలను సండే ఫన్ డేగా నిర్వహించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలకు ఆదివారం ఆటవిడుపుగా ఈ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెనపై 500 మీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారిని నిర్మించారు. 26 పొడవైన స్టీల్ కేబుల్స్.. ఇటలీ నుంచి తెప్పించిన రెండు పైలాన్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications