Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Krishnashtami 2022: నేడే శ్రీకృష్ణాష్టమి వేడుక.. నల్లనయ్య జన్మదిన సంబరాలకు సిద్ధమైంది దేశమిక!!

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్నీ పండుగలే. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా భావించే మాసం శ్రావణ మాసం. ఈ మాసంలోనే శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరగటం కూడా విశేషం. తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి మానవాళికి సందేశం ఇచ్చారు నల్లనయ్య. శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినమే శ్రీ కృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా పిలుస్తారు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా కృష్ణ భక్తులు సంబరాలకు సిద్ధమయ్యారు.

కృష్ణాష్టమి రోజు ప్రతీ ఇంటికీ కృష్ణయ్య ఆగమనం

కృష్ణాష్టమి రోజు ప్రతీ ఇంటికీ కృష్ణయ్య ఆగమనం


కృష్ణాష్టమి నాడు బుడి బుడి అడుగుల బుడతడు అయిన కృష్ణయ్య అందరి ఇళ్ళకు వస్తారని భావిస్తారు. ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి,యశోదలుగా భావించుకుంటూ, తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు, కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రగాడంగా విశ్వసిస్తారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుజ్జాయి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతాడని నమ్ముతారు.

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం.. విశిష్టత ఇదే

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం.. విశిష్టత ఇదే


ధర్మాన్ని రక్షించడానికి మానవాళిని కాపాడటానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం. బాలకృష్ణుడిగా చిలిపి పనులు చేసినా, వెన్నదొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి ప్రతి ఒక్కరికీ ముచ్చటగా అనిపిస్తుంది. ఆయన లీలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్దనుడిగా, గోపికా లోలుడిగా, రాక్షస సంహారిగా, గీత ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది. మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేస్తే ఫలితాలు అంతే గొప్పగా ఉంటాయి.

కృష్ణాష్టమి పూజా విధానమిదే

కృష్ణాష్టమి పూజా విధానమిదే

కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని, అభ్యంగన స్నానమాచరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడంలో చిన్న పిల్లలపై చూపించే లాలన, ప్రేమ, అలంకరణ కృష్ణుడిపై చూపించాలి. కృష్ణయ్యను చక్కగా ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.ఇక పారిజాతాలన్నా కృష్ణుడికి ఇష్టం కాబట్టి, పూజకు పారిజాతాలను వినియోగిస్తే మరింత మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

 కృష్ణయ్య పూజలో ఊయల సేవలు, లాలిపాటలదే ప్రత్యేకం

కృష్ణయ్య పూజలో ఊయల సేవలు, లాలిపాటలదే ప్రత్యేకం

కృష్ణయ్య పూజలో ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ ఊయల ఊపుతూ కృష్ణయ్యను పూజించాలి. అలా చేస్తే కృష్ణుడికి చాలా ఇష్టం అని చెప్తున్నారు. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. అంతేకాదు కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా పెద్దలు చెబుతుంటారు.

వెన్నదొంగకు వెన్న నైవేద్యం పెడితే చాలు .. కృష్ణుడి పాదాలు వేసి ఆహ్వానిస్తే ఇంట్లో సంతోషం

వెన్నదొంగకు వెన్న నైవేద్యం పెడితే చాలు .. కృష్ణుడి పాదాలు వేసి ఆహ్వానిస్తే ఇంట్లో సంతోషం


ఇక కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండివంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు కానీ ప్రస్తుతం అన్ని పదార్ధాలు చేయటం సాధ్యం కానివారు, ఆయనకు ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ముఖ్యంగా వెన్న దొంగకు వెన్న నైవేద్యం పెడితే సంతోషంగా ఆరగిస్తాడని నమ్ముతారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, శనగ పప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్టు పాద ముద్రలు వేసి ఆహ్వానిస్తారు.

 ఉట్టి కొట్టే సంబరం .. యువతలో ఉత్సాహం

ఉట్టి కొట్టే సంబరం .. యువతలో ఉత్సాహం


ఇక కృష్ణాష్టమి రోజున సాయంత్రం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమం ఉట్టి కొట్టే సంబరం. చిన్నారుల్లోనూ యువత లోనూ ఉట్టి కొట్టే వేడుక ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు . దీనికోసం ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు, చిల్లరడబ్బులు, సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కరుగా కానీ, సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారు.రంగులు కలిపిన వసంత నీళ్ళు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అందరిలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది.

 కృష్ణాష్టమి నాడు కృష్ణాలయాల్లోనూ, ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు

కృష్ణాష్టమి నాడు కృష్ణాలయాల్లోనూ, ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు

కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణాలయాలలో, ముఖ్యంగా ఇస్కాన్ దేవాలయాల్లో నిర్వహించే సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయి. కృష్ణాష్టమి సందర్భంగా నేడు కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి. ఇక కృష్ణుడి దేవాలయాల్లో గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+