Krishna Janmashtami 2023: శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు? ఈసారి జన్మాష్టమి చాలా ప్రత్యేకం.. ఎందుకంటే!!
హిందువులు అత్యంత ఇష్టంగా పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి . దీనినే కృష్ణాష్టమి అని, జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని అని రకరకాల పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజున భక్తులందరూ అత్యంత భక్తి భావంతో కృష్ణుని పూజిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి భాద్రపద మాసంలో కృష్ణపక్షం యొక్క ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. ఈసారి కృష్ణాష్టమికి చాలా విశిష్టత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు రోజులపాటు కొన్నిచోట్ల జరుపుకుంటారు. స్మార్త సమూహం మొదటి రోజు జరుపుకుంటే వైష్ణవ శాఖ రెండవ రోజు కృష్ణుడు జన్మదినాన్ని జరుపుకుంటారు.

ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6, 7 తేదీలలో జరుపుకుంటారు. స్మార్త సమూహం సెప్టెంబర్ 6వ తేదీన కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటే, వైష్ణవ సమూహం కృష్ణ జన్మాష్టమిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకుంటారు. కృష్ణ పక్షంలోని భాద్రపద మాసంలో సెప్టెంబర్ ఆరవ తేదీన మధ్యాహ్నం ౩:37 నిమిషాలకు కృష్ణ జన్మాష్టమి ప్రారంభమవుతుంది. అది సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 నిమిషాలకు ముగుస్తుంది.
ఇక రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 6 2023 న ఉదయం 9:20 నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ 7 ఉదయం 10: 25 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో జరిగే కృష్ణాష్టమికి చాలా విశిష్టత ప్రత్యేకత ఉంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ప్రత్యేకమైన ఖగోళ సంయోగం కారణంగా ఈసారి కృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు.
శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన సమయంలో రోహిణి నక్షత్రం ఉంది. ఇప్పుడు 2023 వ సంవత్సరంలో కూడా రోహిణి నక్షత్రం కిందకి వస్తుంది. దీంతో ఈసారి శ్రీకృష్ణాష్టమి చాలా శుభప్రదమైనది గా అరుదైనది గా పరిగణించబడుతుంది.తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం అయిన శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే కృష్ణుని పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోని అడుగు పెడతాడని గట్టిగా నమ్ముతారు. అమ్మలందరు యశోదలుగా, బాలికలంతా గోపెమ్మలుగా, బాలురు చిన్నారి కృష్ణయ్య లుగా ఈరోజు కనువిందు చేస్తారు. కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణ దేవాలయాలలో పూజలు, గీతా పఠనాలు, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications