కుప్పంలో మరోసారి ఉద్రిక్తత!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాల మధ్య విభేదాల్లో భాగంగా ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కుప్పం బైపాస్ రోడ్డులోని మంజునాత్ రెసిడెన్సీలో ఉన్న మురుగేష్‌పై వైసీపీలోని మరోవర్గంవారు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పార్టీలోని మరో వర్గమే దాడిచేసినట్లు తేలడంతో దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి భరత్ సిద్ధపడుతున్నారు.

నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం మొత్తం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అన్న క్యాంటిన్‌ను ప్రారంభించి చంద్రబాబు వెళ్లిన తర్వాత తిరిగి దాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టి చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. తాజాగా వైసీపీలోని రెండువర్గాలు ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడంతో ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం ఘర్షణలకు ఆలవాలంగా మారింది.












Click it and Unblock the Notifications
