పెళ్లి బాజా మోగాల్సిన చోట చావు డప్పు.. అయినా వధువుకు మ్యారేజ్.. ఎక్కడంటే..
పెళ్లి బాజాలు మోగాల్సిన చోట చావు డప్పు మోగింది. పచ్చని పందిరి విషాద వదనంగా మారింది. కర్నూలు జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. బంధువులతో ఇళ్లు కిక్కిరిసిపోయింది. పెళ్లికి అంతా రెడీ అవుతున్నారు. వరుడికి గుండెపోటు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణ నెలకొంది. కానీ వధువుకు మాత్రం పెళ్లి జరిపించారు. మరొ యువకుడితో ముహూర్త సమయానికి పెళ్లి చేశారు.

పెళ్లి నిశ్చయం..
కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం పరిధిలో గల చిన్నతుంబళం గ్రామానికి చెందిన గౌసియా, చాంద్ బాష దంపతులకు ఇద్దరు కుమారులు. ఒక కూతురు. పెద్ద కుమారుడు అబ్దుల్ అనీఫ్ (23)కు హోళగుంద మండలం గుజ్జహళ్లి గ్రామంలో గత ఏడాది పెళ్లి నిశ్చయం అయింది. ఈ నెల 21, 22 తేదీల్లో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. వధువు ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో వరుడు తరపు బంధువులు 21వ తేదీ సాయంత్రం గజ్జహళ్లి గ్రామం చేరుకున్నారు. రాత్రి పెళ్లికి సంబంధించి జరగాల్సిన వేడుకలను జరుపుకున్నారు.

వారం ముందే గుండెపోటు
పెళ్లికి వారం ముందు వరుడికి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చూపించారు. వైద్యుడు పరీక్షించి ఎలాంటి సమస్య లేదని తెలిపాడు. మళ్లీ 21వ తేదీ రాత్రి పెళ్లి వేడుకలు అయిన తరువాత వరుడికి గుండెపోటు రావడంతో స్థానిక వైద్యుడికి చూపించి చికిత్స అందించారు. పెళ్లి రోజు 22వ తేదీన పెళ్లి పనులు జరుగుతుండగా.. పెళ్లికి గంటముందు మళ్లీ వరుడు అబ్దుల్ అనీఫ్ కు గుండెపోటు వచ్చింది. హుటాహుటీన కుటుంబ సభ్యులు కారులో కర్ణాటకలో గల శిరిగుప్పలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి వెళ్లేలోపు అనీఫ్ కన్నుమూశాడు.

విషాద ఛాయలు.. కానీ పెళ్లి
వరుడు మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బోరున విలపించారు. అయితే పెళ్లి కూతురు పేరంట్స్, బంధువులు మాత్రం పెళ్లి ఆగకూడదని అనుకున్నారు. అదే మండలంలోని ఓ యువకుడికి అదే ముహూర్తానికి వధువుతో వివాహం చేయించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికొడుకు మృతిచెందగా, వధువుకు వేరే వ్యక్తికి పెళ్లి జరిపించారు. దీనిని చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఇదేం పని అని నిట్టూర్చారు.












Click it and Unblock the Notifications