టీడీపీ టీ-షర్ట్‌ను స్వయంగా విప్పించిన నారా లోకేష్
కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 75వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. అనంతపురం జిల్లా మీదుగా ఇటీవలే కర్నూలులో అడుగు పెట్టారు.
పత్తికొండ నియోజకవర్గం పరిధిలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు శ్రీదేవిపై విమర్శలు చేశారు. భూకబ్జా ఆరోపణలు గుప్పించారు. ఆలూరు నియోజకవర్గం పరిధిలోని గుడిమిర్లలో గొర్రెల పెంపకందారులను కలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గొర్రెల పెంపకందారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గొర్రెలు, మేకలు పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. మూగజీవాలకు సరఫరా చేయాల్సిన ఉచిత మందుల పంపిణీని నిలిపివేశారని విమర్శించారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక మూగ జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటానికి సబ్సిడీపై షెడ్లను నిర్మిస్తామని, బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
ఈ ఉదయం ఆయన పుప్పలదొడ్డి మీదుగా పాదయాత్ర సాగుతున్నప్పుడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ టీ షర్ట్‌ను ధరించిన ఓ బాలుడు పాదయాత్రలో పాల్గొన్నాడు. ఆ టీ షర్ట్‌పై నారా లోకేష్ ఫొటోతో పాటు చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి ఫొటోలను ముద్రించారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు కుంరం జ్యోతి దీన్ని ముద్రించారు.
ఆ బాలుడిని చూసిన వెంటనే నారా లోకేష్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఇప్పుడే రాజకీయాలు వద్దని, బాగా చదువుకోవాలని సూచించారు. ఆ బాలుడు ధరించిన టీ- షర్ట్‌ను స్వయంగా తొలగించారు. ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఇంత చిన్న వయస్సు నుంచే రాజకీయాల్లో పాల్గొనకూడదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications