యువకుడి హల్‌చల్.. వాటర్‌ట్యాంక్ ఎక్కి మరీ నిరసన: పెళ్లి జరిపించాలని డిమాండ్..
వికారాబాద్‌లో జిల్లాలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని హంగామా చేశాడు. ఏకంగా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి మరీ నిరసన తెలియజేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు బెంబేలెత్తిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సర్దిచెప్పి అక్కడినుంచి దింపేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

పెళ్లి జరిపించాలని వేడుకోలు..
ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించాలని యువకుడు హంగామా చేశాడు. బీర్ సీసాతో తలపై కొట్టుకుంటూ గట్టిగా కేకలు వేశాడు. చివరకు పోలీసులు నచ్చచెప్పి వాటర్ ట్యాంక్ మీదనుంచి కిందకు దింపారు. వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్‌కు గజ్వేల్ కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైంది.

సోషల్ మీడియా కలిపింది వారిద్దరినీ
వీరిద్దరీ మధ్య స్నేహం ఏర్పడింది. కొద్దీరోజులకు ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో యువకుడు సదరు యువతిని తీసుకోని ఇంటికి వచ్చాడు. అయితే వినోద్ తల్లిదండ్రులు అతడిని మందలించి యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వినోద్ ఇంటికి వచ్చి ఆ యువతిని తీసుకెళ్లారు. ప్రియురాలు తనకు దూరమవుతుందన్న బాధలో వినోద్ మద్యం సేవించి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పైకి ఎక్కి నానా యాగీ చేశాడు.

దూకుతాడెమోనని భయాందోళన
గ్రామస్తులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడికి నచ్చచెప్పి కిందకు దించారు. తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల సమక్షంలో వినోద్‌కి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయొద్దని హితవు పలికారు. పోలీసులు చెప్పడంతో ఆ యువకుడు తల ఊపాడు. కానీ స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. అక్కడున్న వారు అతను ఏమవుతాడు.. దూకుతాడా అని భయపడ్డారు. అతను అసలే మత్తులో ఉండటంతో గజ గజ వణికిపోయారు. క్షేమంగా దిగడంతో కాస్త రిలాక్స్ అయ్యారు.












Click it and Unblock the Notifications