మేకను ఎత్తుకెళ్లారంటూ దారుణం: తలకిందులుగా వేలాడదీసి దళిత యువకుడు, కాపరికి చిత్రహింసలు
మంచిర్యాల: మేకను దొంగతనం చేశారనే నెపంతో ఓ దళిత యువకుడితోపాటు పవువుల కాపరిని తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు. 20 రోజుల క్రితం మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది.

ఈ క్రమంలో పశువుల కాపరి తేజ, దళిత యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు రాములు కుటుంబసభ్యులు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

అయితే, తన తమ్ముడిని కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, టౌన్ ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించి వివరాలను సేకరించారు.
కిరణ్ జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని.. కిరణ్‌ను కొట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, ఇటీవలే మంచిర్యాల జిల్లాలో ఓ దళితుడిని కులం పేరుతో దూషిస్తూ కట్టేసి కొట్టిన ఘటన మరువకముందే మరో ఘటన జరగడం స్థానికంగా కలకం రేపుతోంది.












Click it and Unblock the Notifications