• search
  • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరి వద్దా..? అయితే సీఎం వద్దు.. రవి ఫ్యామిలీకి న్యాయం చేయండి: షర్మిల డిమాండ్

|
Google Oneindia TeluguNews

వరి వద్దనే సీఎం మనకు వద్దని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. దిగుబడి సరిగా రాక, కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దని అనడంతో రవికుమార్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. శనివారం మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామంలోని రవికుమార్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దీక్ష చేపట్టారు

కుటుంబం పోషణ

కుటుంబం పోషణ

ఎప్పుడు ఏ కాలం ఉంటుందో తెలియదు. ఎప్పుడు వానలు వస్తాయో తెలియదు. విత్తనాలు, ఎరువులు దొరుకుతయో..దొరకవో...తెలయదు. పంట బాగా పండుతదో పండదో తెలియదు. చివరికి లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియదు. అయినా కూడా రైతు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తాడు. అంత గుండె నిబ్బరం ఉన్న రైతు గుండె బద్దలయ్యేలా, గుండె ఆగిపోయేలా కేసీఆర్ పాలన ఉంది. పొలాల్లో వడ్లు పండించాల్సిన రైతు ఎందుకు ఉరివేసుకుంటున్నాడు..? నాట్లు వేసుకోవాల్సిన రైతు నడిరోడ్డున ఎందుకు పడ్డాడు..? కేసీఆర్ నియంత పాలనతో రైతులు ఆగమైపోతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక వరి కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వరి వేయవద్దని కేసీఆర్ చెబుతున్న మాటలకు అప్పులెలా తీర్చుకోవాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థంకాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు.

వరి కుప్పపై తనువు చాలించి..

వరి కుప్పపై తనువు చాలించి..

కామారెడ్డి జిల్లాలో చిన్న బీర్లయ్య వరి కుప్పపైనే కుప్ప కూలిపోయాడు. కామారెడ్డి జిల్లాలో రాజయ్య ఆ కుప్పల మీదే చనిపోయాడు. ములుగు కుమార్ ఇక ప్రభుత్వం వడ్లు కొనేలా లేదని పురుగుల మందు తాగి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా అయిలయ్య కూడా వడ్లు కొనేలా లేరని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం వడ్లు కొనకపోవడం, యాసంగి వరి వేయవద్దని చెప్పడంతో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న రవికుమార్ కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో రవికుమార్ రాసిన మాటలు చూస్తే ఎవరికైనా కన్నీరు వస్తుందన్నారు.

వరి తప్ప మరే పంట..

వరి తప్ప మరే పంట..

పొలంలో వరి తప్ప మరే పంట పండదు.. వరి వేసుకోవద్దని అంటున్నారు. ఇదివరకే వరి వేసుకున్నా...పెట్టుబడి ఎక్కువైంది. ఉత్పత్తి తక్కువ వచ్చింది. నష్టాల పాలయిపోయా..తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి వరి వేసుకుందామని అనుకుంటే కేసీఆర్ వరి వేసుకోవద్దని అంటున్నారు. వరి వేయకపోతే నేను ఇంకేం వేయాలన్నారు. భూమిలో వేరే పంట వేసే పరిస్థితి లేదన్నారు. వరి వేసుకోకపోతే ఇక ఉరి వేసుకోవాలి. ఇంకేం చేయగలను అని బాధపడి రాశాడు. రైతు తన భూమిలో వరి పండుతుందని, మద్దతు ధర ఉందని వరి వేస్తాడు. రైతు హక్కు మద్దతు ధర. మద్దతు ధర అంటే... మీరు ఈ పంట పండించండి ప్రభుత్వం ఈ ధరకు కొనుగోలు చేస్తుందని రైతుకు భరోసాను కల్పించాలి. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ నిచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? ఒక సారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా..? అని వైఎస్ షర్మిల అడిగారు.

పంట కొనరట

పంట కొనరట


పంట పండించడం వరకే రైతు బాధ్యత. ఆ పంటను కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా..? చివరీ గింజ వరకు కొంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొనుగోలు చేయబోమని రైతులను మోసం చేస్తున్నాడు. వరి కొనబోమని చెప్పే హక్కు మీకు ఎక్కడిది..? రైతు పండించిన పంటకు మద్దతు ధర ఉంది కనుకనే కదా వారు ధైర్యంగా ఆ పంటను సాగుచేసేది. ప్రభుత్వాలే మాట తప్పడంతో రైతులు ఉరివేసుకోవాల్సి వస్తోంది. ఇందుకేనా కేసీఆర్‌ను సీఎం చేసింది. బంగారు తెలంగాణ అన్నారు. రైతులకు బతుకే లేకుండా కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు. ఇది న్యాయమేనా..? వానాకాలం వడ్లతోపాటు యాసంగి వడ్లు కూడా కేసీఆర్ కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలి. ఆ తర్వాత మీరు రా రైస్ చేసుకుంటారా..బాయిల్డ్ రైస్ చేసుకుంటారా...బంగారం చేసుకుంటారా మీ ఇష్టం. మీరు ఇక్కడ అమ్ముకుంటారా...బయట దేశాల్లో అమ్ముకుంటారా అన్నది మీ తలకాయ నొప్పి. అన్ని బాధ్యతలు తీసుకొచ్చి రైతు మీద వేస్తే రైతు ఏమిచేస్తాడు అని అడిగారు.

ఆ సీఎం మనకొద్దు

ఆ సీఎం మనకొద్దు

వరి వద్దనే సీఎం మనకు వద్దనేది ఒక నినాదం కావాలన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రవికుమార్ కుటుంబ సభ్యులను కలిసామని ఆమె చెప్పారు. దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. రవికుమార్ భార్యకు గుండెనొప్పి ఉంది. తల్లిదండ్రులు వృద్ధులు. ఇద్దరికీ కూడా పింఛన్ రాదు. రవికి ఒక కొడుకు. ఒక బిడ్డ.. బిడ్డ పెళ్లి అయ్యింది. ఇంకో బిడ్డ చదువుకుంటోంది. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు. ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుంది. రవికుమార్ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి. వరి వేసుకోవద్దంటే ఇంకో దారి మాకు లేదని రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు. కేసీఆర్ చేసిన హత్యే. కేసీఆర్ రైతు వ్యతిరేకి. రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు.

కలెక్టర్ రాలే

కలెక్టర్ రాలే

ఇంత వరకు కలెక్టర్ రాలేదు. ఎమ్మెల్యే వచ్చి.. 10 వేల రూపాయలు ఇచ్చారు. ఇదేమైనా మెహర్వానీ అనుకుంటున్నారా..? ఆ కుటుంబాన్ని చూసుకుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? రవికుమార్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తానని షర్మిల స్పష్టంచేశారు. కలెక్టరే వస్తారో, ఎమ్మెల్యే వస్తారో.. ఎవరు నష్టపరిహారం ఇస్తారో ఇవ్వాలని కోరారు. రవికుమార్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇదే గ్రామంలో కూర్చుని నిరాహార దీక్ష చేస్తా అని షర్మిల స్పష్టంచేశారు.

English summary
ravi family want crore rupees to telangana government. he recently suicide at his land. ys sharmila angry on cm kcr government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X