నా కుప్పం సీటు కూడా గ్యారంటీ లేకుండా పోయింది- చంద్రబాబు సంచలనం
నంద్యాల: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పర్యటిస్తోన్నారు. నంద్యాల టౌన్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మీదుగా బళ్లారికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో నంద్యాల జిల్లాలో పర్యటించారు.
వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడి పోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు శిల్పా రవిచంద్రరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయనను సండే ఎమ్మెల్యేగా అభివర్ణించారు. సండే ఏమైనా నంద్యాల పట్టణాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

కర్నూలు, నంద్యాల జిల్లాలకు పరిశ్రమలను తీసుకుని రావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు చంద్రబాబు. ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. నీటిపారుదల ప్రాజెక్టులు సైతం పూర్తి కాలేదని, ముచ్చుమర్రి, గోరుకల్లు, పులిచింతల ప్రాజెక్టులను తానే నిర్మించానని చెప్పుకొచ్చారు.
నిర్మాణం పూర్తి చేసిన ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వలేక పోయిందని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, జగన్ రాయల ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ముక్కలు చేసి భూమిలో పాతి పెట్టాలని సూచించారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడటం వల్ల 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు. ఇసుక, మద్యం పేరుతో ఇష్టానుసారంగా దోపిడీలకు పాల్పడుతున్నారని, శిల్పా రవిచంద్రారెడ్డి పెద్ద ఎత్తున భూఆక్రమణలకు దిగాడని ఆరోపించారు.

సరికొత్త వ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నామని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అప్పటివరకు ఏ అభ్యర్థి ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనే విషయం ఎవరికీ తెలియదని అన్నారు. కుప్పంతో సహా ఎవరికీ సీటు గ్యారంటీ లేదని పేర్కొన్నారు.
కుప్పంలో తాను పోటీ చేసేది, లేనిది ఎన్నికల సమయంలో మాత్రమే బయటపెడతానని, ఇప్పటికిప్పుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కుప్పంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ నిర్ణయాన్ని తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications