వెంకయ్య నాయుడిని కలిసిన ఏపీ మంత్రి: కీలక సూచన..!!
నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడితో సమావేశం అయ్యారు. నెల్లూరు స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉన్న వెంకయ్యనాయుడిని కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, మర్యాదపూరకంగా కలిసినట్లు కాకాణి చెప్పారు. వెంకయ్యను సింహపురి ముద్దుబిడ్డగా అభివర్ణించారు.
తన రాజకీయ జీవితంలో వెంకయ్యనాయుడు అంచెలంచెలుగా ఎదిగారని, రాజ్యాంగబద్ధంగా రెండో అత్యున్నత పదవిని అందుకున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి, భారత ఉప రాష్ట్రపతిగా అత్యున్నత పదవుల్లో పనిచేశారని, జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని కాకాణి చెప్పారు. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలకు సేవలను అందిస్తోన్నారని ప్రశంసించారు.

నెల్లూరు శివార్లలోని వెంకటాచలంలో తెలుగు ప్రాచీణ విశిష్ఠ కేంద్రాన్ని నెలకొల్పాలనేది వెంకయ్యనాయుడి కృతనిశ్చయమని, దీనిపై స్టే ఉన్న నేపథ్యంలో న్యాయపరమైన అడ్డంకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని కోరినట్లు వివరించారు. మాతృభాష, మాతృభూమి పట్ల వెంకయ్యకు ఎంతో మమకారం ఉందని కాకాణి పేర్కొన్నారు.
ఆయన చేపట్టిన ఏ పనిని కూడా మాటలకే పరిమితం కాకుండా దాన్ని పూర్తి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. అలాంటి వ్యక్తికి జన్మనివ్వడం నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అని వ్యాఖ్యానించారు. ఆయన మూడురోజులుగా తీరిక లేని షెడ్యూల్‌లో ఉన్నారని, తాను కూడా అన్నమయ్య జిల్లాలో పర్యటించాల్సి రావడం వల్ల కలవలేకపోయానని అన్నారు.

ఇవ్వాళ ఖాళీ సమయం దొరకడంతో మర్యాదపూరకంగా కలిశానని అన్నారు. జిల్లాను సర్వోముఖాభివృద్ధి కోసం తప్పనిసరిగా తాము వెంకయ్యనాయుడి సూచనలు, సలహాల, సహాయ సహకారాలను తీసుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తెలుగు ప్రాచీణ విశిష్ఠ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులపై స్టడీ చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications