నెల్లూరు జిల్లాలో సీట్లు ఫిక్స్ చేసిన చంద్రబాబు?
ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరించి ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఈ జిల్లానే కావడం విశేషం. ఇటీవలి కాలం వరకు వైసీపీకి అనుకూలంగా సాగిన రాజకీయం మారిన పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీవైపు మారింది. కొద్ది ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయేకానీ టీడీపీ ఈ జిల్లాలో మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
కలిసివస్తోన్న పరిణామాలు: ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. క్రమంగా జిల్లాపై పట్టును టీడీపీ పెంచుతోంది. ఊహించనిరీతిలో బలం పుంజుకోవడంతో ఈసారి కచ్చితంగా మెజారిటీ సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం గతానికి భిన్నంగా ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్న చంద్రబాబుకు నెల్లూరు జిల్లాలోని పరిణామాలు బాగా కలిసివచ్చాయి.

దాదాపుగా ఖరారు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో కొన్నింటికి దాదాపుగా అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పవచ్చు. మాజీ మంత్రి నారాయణ మరోసారి నెల్లూరు సిటీలో పోటీకి దిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నెల్లూరు రూరల్ నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. కోవూరులో యువ నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీచేయడం ఖాయమైంది. వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ పోటీచేస్తారా? లేదంటే వైసీపీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి పోటీచేస్తారా? అనే విషయంలో స్పష్టత రాలేదు.
ఆత్మకూరు నుంచి ఎవరో?: సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి పోటీచేయడం ఖాయమంటున్నరు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమిపాలైనవారికి ఈసారి సీటు లేదని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిబంధనను పక్కనపెట్టి సోమిరెడ్డిని బరిలోకి దింపుతారా? కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గూడూరు నుంచి సునీల్ కుమార్ ఉన్నారు. ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం బరిలోకి దిగుతారా? లేదంటే ఆయన కుమార్తె కైవల్యారెడ్డి పోటీచేస్తారా? అనేది ఇంకా ఖరారు కాలేదు. ఒకరకంగా దాదాపు నెల్లూరు జిల్లా నుంచి పోటీచేసే అభ్యర్థులు టీడీపీకి ఏడాది ముందుగానే ఖరారయ్యారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications