Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవితకు షాక్.. నిజామాబాద్ షేక్.. పార్లమెంటరీ బరిలో 1000 మంది రైతులా?

Recommended Video

    1000 Farmers May Contest In Nizamabad MP Seat | Oneindia Telugu

    నిజామాబాద్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కన్నెర్రజేస్తే ఏవిధంగా ఉంటుందో తెలుసా? మద్దతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎట్లుంటుందో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు నిజామాబాద్ జిల్లా రైతులు తీసుకున్న నిర్ణయం సరైన సమాధానంగా కనిపిస్తోంది. తమ హక్కుల పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీకి తమ గళం వినిపించేలా అన్నదాతలు సిద్ధమవుతున్నారు.

    మద్దతు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు వెయ్యి మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. అన్నదాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవితకు షాక్ గా పరిణమించింది.

     సమరానికి సై..!

    సమరానికి సై..!

    టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో రైతన్నలు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. బోధన్ తో పాటు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. అదే క్రమంలో పసుపు, జొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు రైతన్నలు.

    ఇటీవల 20 రోజుల వ్యవధిలో నాలుగైదు సార్లు జాతీయ రహదారిపై నిరసనకు కూడా దిగారు. అయినా ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. మంగళవారం నాడు తలపెట్టిన ఛలో హైదరాబాద్ పాదయాత్రను కూడా పోలీసులు భగ్నం చేయడంతో.. వారు ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

    వాళ్లది నిర్లక్ష్యం.. వీళ్లది పోరాటం

    వాళ్లది నిర్లక్ష్యం.. వీళ్లది పోరాటం

    పసుపు, ఎర్రజొన్న పండించే రైతన్నలు మద్దతు ధర కోసం రోడ్డెక్కారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. అయినా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్రంగానీ స్పందించలేదు. దీంతో తమ సమస్యను దేశవ్యాప్తంగా వినిపించడానికి సరికొత్త పంథా ఎన్నుకున్నారు. నిరసనలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి దాదాపు వెయ్యి మంది రైతులు బరిలోకి దిగబోతున్నారు.

    రానున్న లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 200 గ్రామాల నుంచి వెయ్యి మంది వరకు రైతులు పోటీచేయనున్నారని సమన్వయ కమిటీ ప్రకటించింది. పసుపు అధికంగా పండించే ఊళ్లకు సంబంధించి ఆయా గ్రామాభివృద్ధి కమిటీల నుంచి 5 వేల నుంచి 10వేల రూపాయల వరకు సేకరించి అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లిస్తామంటున్నారు.

     పసుపు ఉత్పత్తిలో నిజామాబాదే టాప్

    పసుపు ఉత్పత్తిలో నిజామాబాదే టాప్


    ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పసుపు ఉత్పత్తిలో భారత్ దే అగ్రస్థానం. అందులో తెలంగాణ వాటా అధికంగా ఉండటమే గాకుండా, నిజామాబాద్ జిల్లాలో పసుపు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అయితే పెట్టుబడులు లక్షల రూపాయలు పెడుతుంటే.. క్వింటాల్ ధర 4,500 రూపాయలు పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధర లభించక అప్పుల్లో కూరుకుపోతున్నామనేది రైతన్నల ఆవేదన. అందుకే క్వింటాల్ పసుపుకు 10వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నిరసనలకు దిగినా పాలకులు పట్టించుకోకపోవడంతో రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు.

     వామ్మో వెయ్యి మందా? గతంలో ఒకసారి ఇలాగే

    వామ్మో వెయ్యి మందా? గతంలో ఒకసారి ఇలాగే

    ఒకవేళ నిజంగానే వెయ్యి మంది పోటీచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. పోటీచేసే అభ్యర్థుల సంఖ్య రెండంకెలు ఉంటేనే గందరగోళంగా ఉంటుంది. అలాంటిది వెయ్యి మంది పోటీచేస్తే.. గుర్తులు కేటాయించడం మొదలు ఈవీఎంల దాకా తలనొప్పి వ్యవహారమే.

    1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. 537 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. చివరకు 480 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అది రికార్డు సృష్టించడమే గాకుండా.. నాటి నుంచి నేటి వరకు అలాంటి ఘటన పునరావృతం కాలేదు. ఆ 480లో కూడా రైతులే ఎక్కువగా పోటీచేయడం గమనార్హం. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్ తో అన్నదాతలు దీక్షలు చేపట్టారు. అయితే అప్పటి ప్రభుత్వాలు కనికరించకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+