జగన్‌కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు
ప్రకాశం: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.

జగన్‌కు సీబీఐ కేసుల భయం
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కేసుల భయం పట్టుకుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనపై కేసులు ఉన్నాయనే సీఎం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడుతున్నారని మండిపడ్డారు. అందుకే మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రుల దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల గురించి బలంగా మాట్లాడలేకపోయారని అన్నారు.

కోడి కత్తి ఏమైంది...?
కోడి కత్తి కేసు ఏమైంది? సొంత చిన్నాన్న కిరాతకంగా హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారూ అప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ సీబీఐకి కేసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మరి ఇప్పుడు ఆ దిశగా ఎందుకు వెళ్లలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

అలాంటి పగటి కలలు కనను
‘ఒంగోలు జిల్లాలో పెరిగాను. గోపాల్‌నగర్‌లో ఉన్నా. కనిగిరిలోనే ఉన్నా. ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధితో ఇప్పటికీ బాధపడుతున్నారని.. అది తనకు బాధేస్తోంది. ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు. అలాంటి పగటి కలలను కనను. ప్రజలందరి కోసమే పార్టీ పెట్టాను. రాజకీయాలంటే డబ్బులతో ముడిపడిపోయింది. పెద్ద మనుషుల చేతిలో ఉండిపోయింది' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

భారీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై నవంబర్ 3న విశాఖపట్నంలో నిర్వహించనున్న ఛలో విశాఖ కార్యక్రమం పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఒంగోలులో జరిగిన సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

పార్టీ బలోపేతం కోసం..
పార్టీని బలోపేతం చేయడానికి మండల, పట్టణ, గ్రామ స్థాయిలో కమిటీలను నియమిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు నాదెండ్ల మనోహర్.












Click it and Unblock the Notifications