SRH vs LSG : నేడు ఇరుజట్లలో ముగ్గురు దక్షిణాఫ్రికా స్టార్ల ఎంట్రీ-హైదరాబాద్ కెప్టెన్ గా మార్క్రమ్ రెడీ
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమై తొలి దశ ముగిసి రెండోదశకు చేరుకున్నా పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మాత్రం ఇంకా ఐపీఎల్ జట్లలో చేరలేదు. స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్ లతో బిజీగా ఉన్న వీరు తాజాగా అవి కాస్తా ముగియడంతో తమ ఐపీఎల్ జట్లలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను పేలవంగా ప్రారంభించిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు వరుస పరాజయాలు తప్పడం లేదు. కెప్టెన్ గా ఎంపికైన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్ స్వదేశంలో మ్యాచ్ ల కారణంగా ఆలస్యంగా జట్టుతో చేరాలని నిర్ణయించుకోవడం సన్ రైజర్స్ కు శాపంగా మారింది. మార్క్రమ్ స్ధానంలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే చెత్త నిర్ణయాలతో విమర్శల పాలవుతున్నాడు. భువీ పేలవ కెప్టెన్సీతో సన్ రైజర్స్ జట్టుపై అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఈ సమయంలో జట్టుతో చేరేందుకు మార్క్రమ్ వచ్చేశాడు.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓ విజయం, ఓ పరాజయంతో సీజన్ ను ఓ మోస్తరుగా ఆరంభించింది. ఈ సమయంలో జట్టులో కీలక ఆటగాడు, కీపర్ కూడా అయిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డీకాక్ జట్టులో చేరకపోవడం ఇబ్బందిగా మారింది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మ్యాచ్ లు ముగియడంతో ఇవాళ డీకాక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరబోతున్నాడు. డీకాక్ రాకతో లక్నో జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో డీకాక్, మార్క్రమ్ ఇద్దరూ ఇరుజట్లలో చేరబోతున్నారు.
దారుణ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా ఐడెన్ మార్క్రమ్ ఇవాళ జత కలుస్తుండగా.. మరో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇవాళ జట్టుతో చేరబోతున్నాడు. వీరిద్దరి రాకతో ఇప్పటికే జట్టుతో ఉన్న ఫజల్ హక్ ఫారూకీతో పాటు గ్లెన్ ఫిలిప్స్ కు ఆ జట్టు విశ్రాంతినివ్వబోతోంది. మరోవైపు లక్నో జట్టులోనూ క్వింటన్ డీకాక్ రాకతో నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ లో ఒకరికి విశ్రాంతినివ్వక తప్పదు. పేలవ ఫామ్ తో సతమతం అవుతున్న స్టోయినిస్ కు విశ్రాంతి తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications