ఏపీ మంత్రికి సొంత పార్టీ నేతల జలక్ : టికెట్ ఇస్తే ఓడిస్తాం..!!
ఏపీ మంత్రి కి సొంత పార్టీలోనే అసమ్మతి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ మంత్రి నియోజకవర్గ వైసీపీ నేతలే అల్టిమేటం జారీ చేసారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రి తీరుతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. మంత్రి పార్టీ శ్రేణులను పట్టించుకో కుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో, రానున్న ఎన్నికల్లో మంత్రి అప్పలరాజుకు తిరిగి టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు.

మంత్రికి సొంత పార్టీ నేతల అసమ్మతి
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యేగా ఉన్న సిదిరి అప్పలరాజుకు సొంత పార్టీ నుంచే సమస్యలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీషా పైన 16 వేల పైగా మెజార్టీతో విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపటంతో, అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజుకు సీఎం కేబినెట్ లో అవకాశం కల్పించారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ అప్పలరాజును కొనసాగించారు. ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వహిస్తున్న అప్పలరాజుకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి వర్గం తయారైంది.

ఎన్నికల్లో సీటిస్తే ఓడిస్తామంటూ
తాజాగా.. అసమ్మతి వర్గ నేతలు వన భోజనాల్లో పాల్గొన్నారు. అప్పలరాజు ఎమ్మెల్యే అయ్యేందుకు సీనియర్ల సహకారం కోరారని గుర్తు చేసారు. పార్టీ కోసం అందరూ అప్పలరాజుకు సహకరిచామని, మంత్రి అయ్యాక అప్పలరాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. పలాస -కాశీబుగ్గ వైసీపీ నేతలు ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. జిల్లా బాధ్యతల్లో ఉన్న కొందరు నేతలు సైతం మంత్రి అప్పలరాజు తీరు పైన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తో పాటుగా ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది.

అప్పలరాజు దారిలోకి తెచ్చుకుంటారా
మంత్రి అప్పలరాజు అవినీతికి పాల్పడ్డారంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు చేయటం.. అసమ్మతివర్గం గా మారటం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. దీంతో, ఇప్పుడు మంత్రి అప్పలరాజు తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెరుగుతున్న అసమ్మతిని ఏ విధంగా దారిలోకి తెచ్చుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, పార్టీ అధినాయకత్వం ఈ పరిణామాలను గమనిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలకు దిగుతారనేది పార్టీలో చర్చకు దారి తీస్తోంది.












Click it and Unblock the Notifications