రూ.500 కోట్లు, 180కేజీల గోల్డ్!: 3ఏళ్లుగా దోపీడికి యత్నం, చివరకు దొరికిపోయారు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి ఇంట్లో రూ. 500 కోట్లు, 180 కిలోల బంగారం ఉందన్న సమాచారంతో మూడేళ్లుగా ఓ దొంగల ముఠా దోపిడీకి విఫలయత్నాలు చేసింది. తాజాగా మరోసారి దోపిడీకి ప్రయత్నించిన ఆ ముఠా పోలీసులకు చిక్కింది.
వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఈ దోపిడీ ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ కాలనీలో నివాసముంటున్న వ్యాపారి తాటిపెల్లి శివప్రసాద్ ఇంట్లో పట్టణానికి చెందిన రమ, విజయ పనిచేస్తున్నారు.
తమ యజమాని ఇంట్లో రూ. 500 కోట్ల నగదు, 180 కేజీల బంగారం ఉందని స్నేహితుడైన సుందరయ్య నగర్‌కు చెందిన సలీంకు చెప్పారు. అతడు మంచిర్యాలకు చెందిన రాజలింగంకు చెప్పి, అతడి స్నేహితులతో కలిసి అంతా ఆ డబ్బును కాజేసేందుకు కుట్రపన్నారు.
ఇందుకోసం మంత్రాల గురువును ఆశ్రయించి, ఆయన సూచించినట్లు ఇంటి పూర్తి వివరాల కోసం రాజలింగం తన స్నేహితులను వెంటబెట్టుకుని శివప్రసాద్ ఇంటికి వచ్చాడు. అక్కడ పని మనుషులతో కలిసి వీడియో తీశాడు. ఇంటి, కరెంటు బిల్లు, ఇతర వివరాలు ఇస్తే గురువు వద్దకు వెళ్లి మంత్రాలతో డబ్బును తరలిస్తామని చెప్పాడు.

అలా సాధ్యంకాకపోవడంతో హైదరాబాద్ వెళ్లి కిరాయిగుండాలతో ఒప్పందం చేసుకున్నారు.
పథకం ప్రకారం గత డిసెంబర్ 29న తలుపులు పగులగొట్టి ఇంట్లో దూరారు. అలికిడి కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మళ్లీ దొంగతనం కోసం 17 మంది జిల్లా కేంద్రానికి వచ్చారు.
డైట్‌గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు విచారించగా, పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో స్టేషన్‌కు తరలించగా, వారు పూర్తి వివరాలు చెప్పారు. మూడేళ్ల నుంచి 4 సార్లు దొంగతనానికి యత్నించామని తెలిపారు. ముఠాలో 23 మంది వరకు ఉన్నన్నట్లు తెలిపారు. కాగా, ఎవరికి తోచిన రీతిలో వారు డబ్బును కాజేసేందుకు విఫలప్రయత్నాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఇందులో ప్రస్తుతం 17మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మిగితా ఆరుగురు పరారీలో ఉన్నారనీ, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్య వహరించిన వన్‌టౌన్ పోలీసులను ఎస్పీ తరుణ్‌జోషీతోపాటు డీఎస్పీ లక్ష్మీనారాయణ అభినందించారు. వన్‌టౌన్ సీఐ రఘురెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుళ్లు అప్పరావ్, రాహత్ పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా, ఓ వ్యాపారి దగ్గర ఇంత భారీ మొత్తం, డబ్బు, బంగారం అసలు ఉందా?, ఉంటే ఎక్కడ్నుంచి వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇంతమంది దొంగలు.. మూడేళ్లుగా ఇన్నిసార్లు దోపిడీకి రావడంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై నిందితులతోపాటు వ్యాపారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications