చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 2003లో 'ఐఎంజీ అకాడమిస్ భారత్'కు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించింది. అయితే, ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది హైకోర్టు.
ఐఎంజీ భారత్ అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా.. దానికి అధినేతగా అహోబలరావు అలియాస్ బిల్లీరావు ఉన్నారు. క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది. ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా.. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003, ఆగస్టు 9న ఉత్తర్వులు జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పోయి 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఆ భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది.
దీంతో అప్పటి నుంచి స్టేటస్‌కోలో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది.












Click it and Unblock the Notifications