ఇన్వెస్టర్ల పాలిట కామధేనువు: 800 శాతం వృద్ధి అందించిన ఏకైక సంస్ధ ఇదే
హైదరాబాద్: భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తోన్న పీవీఆర్ సంస్ధ ఈక్విటీ విలువ త్వరలో రూ. 1000 మార్క్‌ను చేరుకోనుంది. ప్రస్తుతం సంస్ధ విలువ రూ. 930గా ఉంది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పీవీఆర్ సంస్ధ షేర్లను రూ. 1000 పెట్టి పది షేర్లను కొనుగోలు చేసిన వారు, వాటిని ఇప్పుడు అమ్ముకుంటే సుమారుగా రూ. 9,300 వస్తాయి.
ఈ ఐదు సంవత్సరాల్లో బీఎస్ఈ సెన్సెక్స్ నమోదు చేసిన వృద్ధి 46 శాతం కాగా, ఇదే సమయంలో పీవీఆర్ సంస్ధ వృద్ధి శాతం 800 శాతానికి పైగా పెరిగింది. త్వరలో ఈ సంస్ధ ఈక్విటీ షేరు విలువ రూ. 1000 వరకు వెళుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే స్టాక్ మార్కెట్‌లోని బెంచ్ మార్్క ఇండిసెస్ 2 శాతం పెరగ్గా, పీవీఆర్ ఈక్విటీ షేరు ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు కలెక్షన్లను వసూలు చేస్తున్న సినిమాలు పెరగడం, మల్టీ ప్లెక్స్ సంస్కృతి విస్తరిస్తున్న తీరు పీవీఆర్‌కు అనుకూల అంశాలని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

ప్రతి ఏడాది 200 నుంచి 250 స్క్రీన్లను కొత్తగా పెంచుకుంటూ పోతామని పీవీఆర్ యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే దేశంలో మరో 500 స్క్రీన్లను టేకోవర్ చేసే దిశగా డీల్స్ కుదుర్చుకున్నామని, సొంతంగా 100 స్క్రీన్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని యాజమాన్యం చెబుతోంది.
ఇటీవలే రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్‌కు చెందిన డీటీ సినిమాస్‌ను కోనుగోలు చేసేందుకు పీవీఆర్ సిద్ధమైంది. రూ. 433 కోట్లకు గాను ఈ డీల్‌ను కుదుర్చుకున్నట్లుగా పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నిత్ సూద్ తెలిపారు. కాగా పీవీఆర్‌కు పోటీగా ఉన్న ఐనాక్స్ సంస్థ గత సంవత్సరంతో పోలిస్తే 2 శాతం ఆదాయ నష్టాన్ని నమోదు చేయగా, పీవీఆర్ ఏకంగా 19.3 శాతం వృద్ధిని సాధించింది.
ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న సుల్తాన్, మొహంజోదారో, దంగల్ వంటి చిత్రాలు విజయవంతమైతే, పీవీఆర్ షేరు విలువ మరింతగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఐదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఇంత పెద్దమొత్తంలో లాభాలను మరే సంస్థా అందించక పోవడం విశేషం.












Click it and Unblock the Notifications