యువతి శీలానికి వెల: ఐదుగురు రేప్, నిందితుల్లో తండ్రీకొడుకులు, 50వేల ఫైన్
ఆదిలాబాద్: జిల్లాలోని పల్లంగూడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమకు న్యాయం చేయాలని ఊరి పెద్దల వద్దకు వచ్చిన బాధితురాలు, ఆమె కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. గ్రామ పెద్దలుగా చెప్పుకునే వారు ఆ బాలిక శీలానికి వెల కట్టారు. నిందితులందరూ చెరో రూ. 50వేలను బాధితురాలికి ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లంగూడ గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక.. ఐదు కిలోమీటర్ల దూరంలోని కాసిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా, ఇంటి పక్కనే ఉండే యువకుడితో ఆమెకు పరిచయం ఉంది.
ఆ తర్వాత అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మరో నలుగురు సైతం బాలికను బెదిరించి లోబర్చుకున్నారు. వీరిలో తండ్రీ కొడుకు కూడా ఉండటం వారి కీచకపర్వానికి నిదర్శనం. ఒకవైపు కామాంధుల లైంగిక వేధింపులను భరించలేక, మరోవైపు కుటుంబానికి చెప్పుకోలేక చాలాకాలం బాలిక నలిగిపోయింది.

ఈ క్రమంలో ఇటీవల ఆమె తీవ్రంగా జబ్బుపడింది. పరీక్షలు జరిపిన వైద్యులు, ఆమె గర్భవతి అని తేల్చడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. గట్టిగా అడిగేసరికి, జరిగిందంతా వారితో చెప్పుకొని కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో ఈ అంశాన్ని తల్లిదండ్రులు ఊరి పంచాయతీ పెద్దల ముందు పెట్టారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిలో తండ్రీ కొడుకులు ఉండటం వల్లనో లేక, ఒకరి కన్నా ఎక్కువపేర్లు బయటకురావడం వల్లనో గానీ పంచాయతీ పెద్దలు విషయాన్ని తొక్కిపెట్టాల ని ప్రయత్నించారు. 'న్యాయం చేయండి' అని వేడుకొన్న బాధితురాలిని డబ్బులతో నోరు ముయించడానికి ప్రయత్నించారు.
ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురి నుంచి రూ.50 వేలు చొప్పున వసూలు చేసి.. ఇప్పిస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు. గర్భవతిగా ఉన్న ఆమెకు భర్త ఎవరనేది గానీ, ఆమె కడుపులోకి బిడ్డకు తండ్రి ఎవరనేది గానీ పట్టించుకోలేదు ఆ పెద్దలని చెప్పుకుంటున్న మూర్ఖులు. ఇప్పుడామెకు ఏడో నెల నిండుతోంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోనే తాము చర్యలు తీసుకోలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications