వివాహేతర సంబంధానికి సహకారం: మద్యం తాగించి దారుణ హత్య
రంగారెడ్డి: వివాహేతర సంబంధానికి సహకరిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం హత్య చేసిన హంతకుడు లొంగిపోవడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకులం ప్రాంతానికి చెందిన అలజంగి కృష్ణ(46) తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో 20సంవత్సరాల క్రితం మేడ్చల్ ప్రాంతానికి బతుకుదెరువు కోసం వలస వచ్చారు. రాజబొల్లారం గ్రామ శివారులోని దామోదర్ ఫాంహౌస్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో కృష్ణ మే 16న సాయంత్రం ఇంటి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు రెండు రోజులు అతని కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో మే 18న మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మేడ్చల్ పోలీసులు ఫౌంహౌస్‌కు, గ్రామానికి వెళ్లి రెండు మూడు సార్లు విచారణ జరిపారు. కేసు దర్యాప్తులో ఉండగానే అనుకోకుండా రాజబొల్లారంవాసి పిల్లి భాస్కర్ అనే యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ రాజశేఖర్‌రెడ్డి ముందు తానే కృష్ణను హతమార్చానని చెప్పి లొంగిపోయాడు.
దీంతో సీఐ.. హంతకుడిని తీసుకుని తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా హంతకుడు చెప్పినట్లు మృతదేహం రాజబొల్లారం శివారులోని ఓ ప్రైవేట్ స్థలంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడి ఉంది. ఈ విషయాన్ని మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు వచ్చి.. చనిపోయిన వ్యక్తి కృష్ణే అని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు.
వివాహేతర సంబంధానికి సహకరించడమే హత్యకు దారితీసింది
పథకం ప్రకారమే కృష్ణను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. నిందితుడు పిల్లి భాస్కర్ పనీపాటా లేకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇతని పొలం కృష్ణ పనిచేస్తున్న ఫాంహౌస్‌కు సమీపంలో ఉంది.
కాగా, హంతకుడు భాస్కర్ బంధువు ఓ మహిళ రాజబొల్లారానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకొని అతడితో తరచూ కృష్ణ పనిచేస్తున్న ఫాంహౌస్‌కు వచ్చిపోతుండేది. భాస్కర్ ఈ విషయమై కృష్ణతో పలుమార్లు గొడువ పడ్డాడు. వారిని మీ ఫాంహౌస్‌కు ఎందుకు రానిస్తున్నావని నిలదీశాడు. కృష్ణ అతనితో 'నీకెందుకు' అంటూ విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు.
తన బంధువు అక్రమ కార్యకలాపాల కోసం కృష్ణ షెల్టర్ ఇస్తున్నాడని అతని మీద కక్ష పెంచుకున్న భాస్కర్.. ఎలాగైనా అతడ్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో పథకం పన్నిన భాస్కర్.. మే 16న సాయంత్రం పొలం వద్దకు వెళ్లి మద్యం తాగుదామని చెప్పి కృష్ణను బైక్ మీద తీసుకొని మేడ్చల్‌కు చేరుకున్నాడు. మేడ్చల్‌లోని టింకు వైన్స్ వద్ద మద్యం సేవించి అనంతరం జేబులో డబ్బులు లేకపోవడంతో కృష్ణ ఫోన్‌ను మేడ్చల్‌లోని ఓ మార్వాడీ దుకాణంలో కుదువపెట్టి రూ.500 తీసుకుని తిరుగు ప్రయాణమాయ్యారు.
రాజబొల్లారం పోతూపోతూ మార్గమధ్యలో పూడూరు గ్రామ చౌరస్తా వద్ద గల వైన్స్‌లో రెండు బీర్లు, ఒక క్వాటర్ సీసాలు తీసుకుని రాజబొల్లారం శివారులో అట్టల కంపెనీ ఎదురుగా గల ఓ ప్రైవైట్ స్థలంలోకి కాంపౌండ్ దాటి వెళ్లి మద్యం సేవించారు.
అనంతరం మత్తులో ఉన్న కృష్ణను భాస్కర్ బీరు సీసాతో తల మీద కొట్టాడు. దీంతో కృష్ణ నేల మీద పడిపోగా వెంటనే పక్కనే ఉన్న రాయితో మరోమారు తలమీద బాదాడు. దీంతో తల పగిలిపోయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంటికి వెళ్లిన భాస్కర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే, పోలీసులు కృష్ణ కేసులో గాలింపు చేపట్టిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఎలాగైనా దొరికిపోతానని అనుకొని ఆదివారం పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వచ్చి లొంగిపోయాడు. దీంతో అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications