35మంది ప్రయాణికులను కాపాడి.. కన్నుమూసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్
ఆదిలాబాద్: ఓ వైపు తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్.. తను నడపుతున్న బస్సులోని 35మంది ప్రయాణికుల క్షేమం కోసం ఆలోచించాడు. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మందమర్రి శివారు ఊరుమందమర్రికి చెందిన నాగుల స్వామి (53) మంచిర్యాల డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కండక్టర్ సత్యనారాయణతో కలిసి సోమవారం ఉదయం మంచిర్యాల నుంచి జగిత్యాలకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి వస్తుండగా గూడెం చెక్‌పోస్టు దాటిన తర్వాత లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా చేరుకునే సరికి ఛాతిలో నొప్పి రావడంతో తల్లడిల్లిపోయాడు.

అతికష్టంగా బస్సును పక్కకు ఆపి, కండక్టరుకు చెప్పి వెనుక సీట్లో పడుకున్నాడు. 108లో మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వామికి గుండెపోటు వచ్చినప్పుడు బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులున్నారు.
గుండెనొప్పితో విలవిల్లాడుతూ కూడా బస్సును పక్కకు ఆపి తమను కాపాడి కన్నుమూయడంతో ప్రయాణికులు కంటతడి పెట్టారు. మృతుడు స్వామికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
డీఎం రజనీక్రిష్ణ, సీఐ విశ్వనాథం, ఆర్టీసీ యూనియన్ల నేతలు కుటుంబసభ్యులను ఓదార్చారు. స్వామి అంత్యక్రియలకు రూ.10వేలు డీఎం రజనీక్రిష్ణ అందజేశారు. స్వామి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హమీఇచ్చారు.












Click it and Unblock the Notifications