ఆర్టీసీ బస్సులు రావడం లేదు! జస్టిస్ ఎన్వీ రమణకు విద్యార్థిని ఫిర్యాదు, సజ్జనార్ స్పందన
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడం, లేదా రాకపోవడం లాంటి సమస్యలు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎవరైనా డిపో మేనేజర్ లేదా టీఎస్ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరతారు. కానీ, ఓ విద్యార్థిని మాత్రం ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది.
ఆ వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే 8వ తరగతి విద్యార్థిని ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో విసిగిపోయింది. ఈ క్రమంలో తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది.

ఆ విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు తెలిపారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ ఎన్వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
#TSRTC Management sincerely Thank the Hon'ble apex court Chief Justice of India #CJIRamana Sir for alerting us to restore buses to send students on school timings in token of honoring #RTE @rashtrapatibhvn @PMOIndia @DrTamilisaiGuv @TelanganaCMO @barandbench @LiveLawIndia pic.twitter.com/eCkIopxZfH
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 3, 2021
కాగా, టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీలో సజ్జనార్ పలు సంస్కరణలు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. డబ్బు చెల్లింపులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం కొన్ని బస్టాండ్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికుల నుంచి యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలను పాసింజర్స్ వినియోగించుకునే వెసులుబాటు కలిగించారు. ప్రయాణికులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకుని.. తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు.
మరోవైపు, ఆర్టీసీ బస్సులను శుభ్రంగా ఉంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టీసీ డ్రైవర్లు గుట్కాలు, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన డ్రైవర్లపై క్రమశిక్షలు చర్యలు తీసుకునేలా ఈడీలు, డీవీఎంలు, డీఎంలకు ఆదేశాలు జారీ చేశారు.
కొందరు ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవింగ్ సమయంలో గుట్కాలు, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. బస్సులను కూడా అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు. వీటిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతో సజ్జనార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ బస్సుకు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ లాంటి వాళ్లు. వారు ప్రయాణికుల పట్ల పద్ధతిగా వ్యవహరించాలి. పొగాకు పదార్థాలు నములుతూ బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు. ఎవరైనా ఈ ఆదేశాలకు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు డిపో మీటింగ్స్‌లో ఈ విషయంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, తరచూ తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు. పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుని ప్రయాణికులు డబ్బులను ఆదా చేసుకోవచ్చని సూచించారు సజ్జనార్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు చేశారు.












Click it and Unblock the Notifications