సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా గుడి అంటే దేవుళ్లకు కడతారు. అయితే కొంతకాలం నుంచి ట్రెండ్ మారింది. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అభిమానులు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే హీరోయిన్ ఖుష్ బూకు కూడా గుడి కట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓ అభిమాని హైదరాబాద్ లో గుడి కట్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరారు.
రేవంత్ కు గుడి కట్టేందుకు ఓ అభిమాని ముందుకు వచ్చారు. తన సొంత నిధులతో ఈనెల 19వ తేదీన భూమి పూజ చేయబోతున్నారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి సంతోష్ కు సీఎం రేవంత్ రెడ్డి అంటే బాగా అభిమానం. రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత రేవంత్ నిర్వహించిన పాదయాత్రలో కూడా సంతోష్ పాల్గొన్నాడు.

ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో రేవంత్ ఘనవిజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజారంజకమైన పరిపాలనను ముఖ్యమంత్రి చేస్తున్నారని సంతోష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న రేవంతన్న కనిపించే దేవుడు అని, ఆయనకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
తన సొంత స్థలంలో రూ. 3 లక్షల నిధులతో గుడి కట్టబోతున్నట్లు సంతోష్ వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన ముగ్గురు మంత్రుల సమక్షంలో భూమి పూజ జరుగుతుందని, రెండు నెలలలో గుడి నిర్మాణం పూర్తవుతుందన్నాడు. ప్రజలచేత దైవంగా పిలవబడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టించే భాగ్యం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానాన్ని సంతోష్ ఇలా నిరూపించుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications