ఇంట్లోకి వచ్చి మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య
నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నడిపల్లితండాలో దారుణం చోటు చేసుకుంది. నడిపల్లి తండా శివారులోని సిఎంసి కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న గంధం లక్ష్మి (44) అనే మహిళపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హతమార్చారు. ఈ ఘటన శనివారం వెలుగుచూసింది.
నిజామాబాద్ డిఎస్పీ ఆనంద్‌కుమార్, సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నిజామాబాద్ మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన గంధం లక్ష్మి 15రోజుల క్రితం బతుకుదెరువు కోసం తన భర్త రాములుతో కలిసి నడ్‌పల్లితండాకు వచ్చింది. రోజువారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి లక్ష్మిపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అనంతరం దుడ్డుకర్ర, రాళ్లతో తలపై బలంగా మోదడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో మృతురాలి భర్త ఇంట్లోనే ఉన్నప్పటికీ, బాగా మద్యం సేవించిన మైకంతో గాఢనిద్రలో జోగుతున్నాడని, అయితే లక్ష్మి కేకలు విని రాములు మైకం నుండి తేరుకుని నిద్రలేచే సరికి ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోతూ కనిపించినట్లు తమ దృష్టికి తెచ్చాడని డిఎస్పీ వివరించారు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. శవ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని డిఎస్పీ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా, ఈ కేసులో సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications