ప్రేమ వివాహం: యువతి కళ్లెదుటే యువకుడిని దారుణంగా చంపేశారు
తమ అంగీకారం లేకుండా కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో అమ్మాయి తరపు బంధువులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దూలపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ అంగీకారం లేకుండా కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో అమ్మాయి తరపు బంధువులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. తన భార్య ఎదుటే అతడ్ని హత్య చేయడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హరీశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దూలపల్లికి వచ్చి ఇల్లు కట్టుకుని తన తల్లితో అక్కడే నివాసం ఉంటున్నాడు. గతంలో అతను ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే, ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అయితే, హరీశ్ తన నివాసం మార్చినప్పటికీ.. ఆ యువతితో ప్రేమను కొనసాగించాడు. వీరిద్దరూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. అంతేగాక, ఆ యువతిని కొంత కాలం క్రితం వివాహం కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నాడనే కారణంతో అమ్మాయి తరపు బంధువులు అతడ్ని దారుణంగా హత్య చేశారు. అయితే, రెండు రోజుల క్రితమే అతని హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
నలుగురు యువకులు వచ్చి హరీశ్ ను కత్తులతో పొడిచి చంపినట్లు పలువురు ప్రత్యక్షసాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. మొదటగా గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా, దూలపల్లికి చెందిన హరీశ్‌గా గుర్తించారు. వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకే తన కుమారుడిని యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని అతని తల్లి ఆరోపించింది. కాగా, ఘటనపై దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హరీశ్ ను హత్య చేసి అతని భార్య అయిన యువతిని తమ వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications