ప్రియురాలిని పిలిచి.. డబ్బుల్లేక వెళ్లిపొమ్మన్నాడు
హైదరాబాద్: తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని తన వద్ద డబ్బు లేదని, నువ్వు డబ్బు తీసుకువస్తే ఎక్కడికైనా వెళ్లిపోదామని ఓ యువకుడు ఆమెను వదిలించుకున్న సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన యువతి(19) 8వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటోంది.
కాగా, రెండున్నరేళ్ల క్రితం వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయానికి వెళ్లినప్పుడు విశాఖపట్నంకు చెందిన అఖిల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ తరచూ ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు.

దీంతో ఆ యువతి అఖిల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇద్దరూ కలిసి మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తన వద్ద డబ్బేమీ లేదని, నీ దగ్గర కూడా లేకపోతే మనం జీవించడం కష్టమవుతుందని అఖిల్ యువతికి చెప్పాడు. అంతేగాక ఆమెను రైల్వే ఫ్లాట్ ఫాంపైనే వదిలేసి వెళ్లిపోయాడు.
ఏం చేయాలో తెలియక ఆ యువతి అటు ఇటు తిరుగుతుంటే అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెను విచారించడంతో జరిగిన విషయం తెలిపింది. అయితే ప్రియుడి పూర్తి వివరాలు ఏమి తెలియవని, అతడ్ని తీసుకొచ్చి తనతో వివాహం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌కు వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమెను తమతో తీసుకెళ్లారు. తమ కూతురును సురక్షితంగా అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications