తెలంగాణ తెరపై ఇక కొత్త నేత
Abhishek Manu Singhvi: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త నాయకుడి పేరు తెరమీదికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపా దాస్ మున్షీ, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి మాజీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది. తన పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు రాజ్యసభ పదవీ కాలం 2026 ఏప్రిల్ 9వ తేదీ వరకు ఉంది.

ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన ఈ స్థానంలో అభిషేక్ మను సింఘ్వీని నామినేట్ చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఆయన అభ్యర్థిత్వాన్ని రెండు రోజుల కిందటే అధికారికంగా ప్రకటించింది. ఆదివారమే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కొద్దిసేపటి కిందటే మను సింఘ్వీ.. తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీ. 22న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. 6వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఈసీ ఈ షెడ్యూల్‌లో వివరించింది.
తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే విడుదల చేసింది. ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు అస్సాం, బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిషా ఉన్నాయి.
అస్సాం- కామాఖ్య ప్రసాద్ టాసా, సర్బానంద సొనొవాల్, బిహార్- మీసా భారతి, వివేక్ ఠాకూర్, హర్యానా- దీపేందర్ సింగ్ హుడా, మధ్యప్రదేశ్- జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర- ఉదయరాజె భోంస్లే, పియూష్ గోయెల్, కేసీ వేణుగోపాల్- రాజస్థాన్, తెలంగాణ- కే కేశవరావు, ఒడిశా- మమత మొహంతా పదవులు ఖాళీ అయ్యాయి.
కేశవరావు, మమత మొహంతా తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు అవసరం అయ్యాయి. మిగిలిన వారంతా కూడా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయా కారణాల వల్ల రాజ్యసభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications