అల్లు అర్జున్‌పై విమర్శలు చేసిన ఏసీపీపై చర్యలు!
ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టి సినీనటుడు అల్లు అర్జున్‌పై విమర్శలు చేసిన ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ తెలిపారు. విష్ణు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారని చెప్పారు.
తమ అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించి విష్ణుపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి మేం అసలు సహించం. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలకు మేం చింతిస్తున్నాం అని డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ తెలిపారు. కాగా, ప్రెస్‌మీట్‌లో ఏసీపీ విష్ణుమూర్తి.. అల్లు అర్జున్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని విష్ణు మండిపడ్డారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్‌మీట్ పెట్టవచ్చా? అని ప్రశ్నించారు. కొందరు నటులు, రాజకీయ నాయకులు పోలీసులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అని అన్నారు.
నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే కుదరదన్నారు. థియేటర్ ఘటనలో చనిపోతే వారిని చూడకుండా వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. సినిమాలో పోలీసు అధికారిని వ్యంగ్యంగా చూపించారని అన్నారు. ఒక్క పోలీసు అధికారిని కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావో ఆలోచించుకో అని విష్ణుమూర్తి అన్నారు. పోలీసు అధికారులు ఓపిక నశిస్తే.. ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని తమకు తెలుసన్నారు.
ఎవడైనా సరే తోలు తీస్తాం అంటూ హెచ్చరించారు. చనిపోయిన వారి గురించి చెప్పడం రాదు.. నువ్వు ఎలా నటుడు అయ్యావని దుయ్యబట్టారు. ముందు నటన నేర్చుకో.. నువ్వు కామన్ వ్యక్తివి తీస్‌మార్‌ఖాన్ కాదని అన్నారు. పోలీసు అధికారులపై జాగ్రత్తగా మాట్లాడు.. లేకపోతే రీల్స్ కట్ అవుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సినీనటుడు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు.
'శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. 'సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి' అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, సంధ్య థియేటర్ ఘటనపై ఏసీపీ విష్ణు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
రాళ్లు, టమాటలతో అల్లు అర్జున్ నివాసంపై దాడి
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు కొందరు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని.. వెంటనే రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు.
రాళ్లు తగలడంతో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్‌లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, దాడి ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. జరిగిన రాళ్ల దాడిపై సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications